Amazing: వైద్య శాస్త్రంలో చైనా పరిశోధకులు మరో కీలక మైలురాయిని సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి సేకరించిన కాలేయంతో పాటు రెండు మూత్రపిండాలను ఒకే వ్యక్తికి విజయవంతంగా మార్పిడి చేశారు. ఒకేసారి మూడు జంతు అవయవాలను మానవ శరీరంలో అమర్చడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి.
సౌత్ చైనాలోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సన్ జుయాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. వైద్య పరిభాషలో దీనిని “ఆర్థోటోపిక్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్” అని పిలుస్తారు. ఈ విధానంలో పంది కాలేయం, రెండు కిడ్నీలను ఒకేసారి మానవ శరీరంలో అమర్చారు.
ఈ పరిశోధన కోసం బ్రెయిన్‌డెడ్ అయిన 53 ఏళ్ల వ్యక్తి శరీరాన్ని ఉపయోగించారు. అతని కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ శస్త్రచికిత్స చేపట్టినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇందుకోసం చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతానికి చెందిన ప్రత్యేక ‘బామా’ జాతి పంది నుంచి అవయవాలను సేకరించారు.
సాధారణంగా జంతువుల నుంచి తీసిన అవయవాలను మానవ శరీరం తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు పంది జన్యువుల్లో ప్రత్యేక మార్పులు చేశారు. రోగనిరోధక వ్యవస్థ అవయవాలను తిరస్కరించడానికి కారణమయ్యే మూడు జన్యువులను తొలగించడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగుపరచే మరియు మానవ శరీరానికి అనుకూలంగా ఉండే మూడు మానవ జన్యువులను పందిలో ప్రవేశపెట్టారు.
శస్త్రచికిత్స అనంతరం కేవలం 24 గంటల్లోనే సానుకూల ఫలితాలు కనిపించాయి. మార్పిడి చేసిన పంది కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించగా, రెండు మూత్రపిండాలు కూడా సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టాయి. అలాగే రోగి రక్తంలో క్రియాటినిన్ స్థాయులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడం మూత్రపిండాల పనితీరు సరిగా ఉందని సూచిస్తోందని పరిశోధకులు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో సన్ జుయాంగ్ అభివృద్ధి చేసిన ప్రత్యేక ఆర్థోటోపిక్ శస్త్రచికిత్స పద్ధతిని ఉపయోగించారు. ఒకే శస్త్రచికిత్స కోత ద్వారా కాలేయం, రెండు కిడ్నీలను అమర్చడం ఈ సాంకేతికత ప్రత్యేకతగా నిలిచింది.
ఒకేసారి బహుళ జంతు అవయవాలు మానవ శరీరంలో సమర్థవంతంగా పనిచేయగలవని ఈ అధ్యయనం స్పష్టంచేసిందని పరిశోధక బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవయవ దాతల కొరత సమస్యకు భవిష్యత్తులో ఇది కీలక పరిష్కారంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో సాధించిన ఈ విజయం మరిన్ని క్లినికల్ పరిశోధనలకు మార్గం సుగమం చేయడమే కాకుండా, అవయవ మార్పిడి వైద్య విధానాల్లో కొత్త అవకాశాలకు తెరతీస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
