Crime: అరుణాచలంలో యువతులను నగ్నంగా వీడియోలు తీసి.. SMలో షేర్ చేస్తామని..

Eight Arrested in the case of gang raped at arunachalam

Eight Arrested in the case of gang raped at arunachalam

Crime: తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణ మార్గంలో రెండు వేర్వేరు ఘటనల్లో యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ధర్మపురి జిల్లాకు చెందిన ఓ వివాహిత గత నెల 30వ తేదీన తన స్నేహితులతో కలిసి పౌర్ణమి గిరి ప్రదక్షిణ కోసం తిరువణ్ణామలైకి వచ్చింది. రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న అనంతరం వారు ద్విచక్ర వాహనాలపై తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్దకోలాపాడి ప్రాంతంలో వివాహిత, ఆమె స్నేహితుడు కొద్దిసేపు వాహనం ఆపి మాట్లాడుతుండగా, మారణాయుధాలతో వచ్చిన ఓ ముఠా వారిని బెదిరించి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది.

అక్కడ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాధితురాలు, ఆమె స్నేహితుడి దుస్తులు లాక్కొని నగ్నంగా వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఆ వీడియోలను బాధితురాలికి పంపి రూ.1 లక్ష డబ్బు డిమాండ్ చేస్తూ, చెల్లించకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. బాధితురాలు రూ.4 వేల రూపాయలు పంపిన అనంతరం ధర్మపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు తిరువణ్ణామలై పడమర పోలీసులకు బదిలీ చేయగా, వారు దర్యాప్తు ప్రారంభించారు.

ఇక మరో ఘటన గత నెల 31వ తేదీ రాత్రి చోటుచేసుకుంది. తిరువణ్ణామలై మున్సిపల్ పరిధికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ల నొప్పులతో అడిఅన్నామలై గ్రామం వద్ద విశ్రాంతి తీసుకుంది. అనంతరం తన స్నేహితుడిని అక్కడికి రమ్మని పిలిచింది. ఇద్దరూ కలిసి సమీప హోటల్‌లో టిఫిన్ పార్సిల్ తీసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డుకు వెళ్లారు.

అక్కడ కూడా ఓ ముఠా వారిని అడ్డగించి బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాధితులపై దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం వారిద్దరినీ నగ్నంగా వీడియోలు తీసి, యువతి ధరించిన రెండు గ్రాముల బంగారు చెవి కమ్మలను లాక్కొని పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ రెండు ఘటనలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మొత్తం 11 మంది ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఆడయూర్ గ్రామానికి చెందిన వాసుదేవన్, పెద్దబాలియపట్టు ప్రాంతానికి చెందిన ఆకాష్, అశ్వనాథసురన్ గ్రామానికి చెందిన అప్పు, హరిహరన్, శర్మ, సేందమంగళం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, తిరువణ్ణామలై బాలాజీ నగర్‌కు చెందిన శివగణేశన్‌తో పాటు ఒక 16 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలు తిరువణ్ణామలై ప్రాంతంలో కలకలం రేపగా, గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Parenting Tips: పిల్లలను మొదటిసారి స్కూల్‌కు పంపుతున్నారా? ఇలా చేస్తే అస్సలు మారాం చేయరు

Crime: అరుణాచలంలో యువతులను నగ్నంగా వీడియోలు తీసి.. SMలో షేర్ చేస్తామని..