Weather: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉండగా, ఆ తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ఈ పరిస్థితిపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వచ్చే 2–3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని, గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని సూచించింది.
తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావం, క్యూములోనింబస్ మేఘాల ఏర్పాటుతో ఈ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు వివరించారు. శుక్రవారం నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
అదే సమయంలో, రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
