Pahalgam Attack: పహల్గాం (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి నేటికి ఏడాది పూర్తైంది. అయితే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయటపడలేకపోతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన కొత్త విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తులో భాగంగా, ఆ దాడి చేసిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులకు స్థానికులైన ఇద్దరు ఆశ్రయం కల్పించినట్లు తెలిసింది. పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు, ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన సమయంలో చెప్పకుండా దాచిపెట్టారు. అంతేకాదు, మౌనం పాటించడానికి వారు ఉగ్రవాదుల నుంచి రూ.3 వేల లంచం తీసుకున్నారని ఎన్‌ఐఏ విచారణలో బయటపడింది.
గత ఏడాది ఏప్రిల్ 21 రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో, ఈ ముగ్గురు ఉగ్రవాదులు వారి వద్దకు చేరుకుని దాదాపు ఐదు గంటలపాటు అక్కడే ఉన్నారు. వారి వద్ద ఆయుధాలు ఉండటం, ఉర్దూ-పంజాబీ మిశ్రమ భాషలో మాట్లాడటం గమనించారు. లష్కరే తయ్యిబా అగ్ర కమాండర్ సాజిత్ జాట్ అలియాస్ అలీభాయ్ గురించి కూడా వారు మాట్లాడుకున్నట్లు సమాచారం. తమ ప్రాంతంలో దాడి జరిగే అవకాశం ఉందని అర్థమైనప్పటికీ, ఆ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదు.
ఉగ్రవాదులు అక్కడే భోజనం చేసి వెళ్లిపోయారు. అందుకు ప్రతిగా రూ.3 వేల రూపాయలు ఇచ్చారు. తర్వాతి రోజు ఏప్రిల్ 22న మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో, వారు బైసరన్ లోయలోని ఒక కంచె వెనకాల దాక్కున్నట్లు ఈ ఇద్దరు గుర్తించారు. అయినప్పటికీ, ఈ సమాచారాన్ని పోలీసులకు లేదా స్థానిక టూరిజం వర్గాలకు అందించలేదు.
దీనికి బదులుగా, తమ గుర్రాలపై పర్యాటకులు ఎవరైనా వస్తారా అనే విషయానికే వారు ప్రాధాన్యత ఇచ్చారు. మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో వచ్చిన కొంతమంది పర్యాటకులను బైసరన్ లోయకు తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత అక్కడ కాల్పులు ప్రారంభమై, ప్రాంతం మొత్తం రక్తపాతం చోటుచేసుకుంది. ఈ పరిస్థితిని చూసిన తర్వాత కూడా, ఈ ఇద్దరు తమకు సంబంధం లేదన్నట్టుగా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ, గత ఏడాది జూన్ 22న పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌లను అరెస్టు చేసింది. డిసెంబర్‌లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడు సాజిత్ జాట్‌తో పాటు ఈ ఇద్దరి పేర్లను కూడా చేర్చింది.
