Komarakka: జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కొమురక్కపై అభిమానులమని చెప్పుకుని వచ్చిన కొంతమంది దాడి చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బూర్గుల పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ అనే వ్యక్తి కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ విషయంలో శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, అతను తప్పు ఒప్పుకుని తిరిగి ఇస్తానని చెప్పాడు. అయితే, చాలాసార్లు అడిగినా బంగారం ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం కొమురక్క అతన్ని మళ్లీ మందలించారు.
ఈ విషయాన్ని శ్రీనాథ్ తన స్వగ్రామంలోని స్నేహితులకు చెప్పాడు. దీంతో వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్ అనే ఎనిమిది మంది మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొమురక్క ఇంటికి వచ్చారు. వారు అభిమానులమని, ఫోటో తీసుకోవాలని చెప్పి నమ్మించారు.
అయితే కొద్ది సేపటికే రామ్‌చరణ్ అనే వ్యక్తి శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావని వాగ్వాదం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వంశీకృష్ణ రాయితో కొమురక్కపై దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆయన సోదరుడు యాదయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే వికాస్ యాదయ్యపై రాయితో దాడి చేశాడు. చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడి చేతికి గాయపరిచాడు. వారిని ఆపడానికి వచ్చిన గ్రామస్థుడు రామును కూడా రాళ్లతో కొట్టారు.
దాడి అనంతరం నిందితులు చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు తమ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.
