Health News: ఎండాకాలంలోనే మీ ఆఫీస్‌లో లేదా ఇంట్లో ఉన్నవాళ్లు జలుబు, దగ్గు, తుమ్ములతో ఇబ్బంది పడుతున్నారా? పిల్లలు కూడా తరచూ జలుబుతో బాధపడుతున్నారా? ఇది అసాధారణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలంలో ఇలాంటి సమస్యలు రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయని వారు వివరించారు.
ఇటీవలి కాలంలో వాతావరణం గంటల వ్యవధిలోనే మారిపోతుంది. ఈ మార్పులు శరీరంపై ప్రభావం చూపి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. అలాగే పొడి వాతావరణం, నిర్మాణ పనుల వల్ల గాలిలో పెరిగే దుమ్ము ధూళి ముక్కు, గొంతులోకి వెళ్లి అలర్జీలకు కారణమవుతుంది.
ఇంకా చలికాలంలో ఉన్న కొన్ని వైరస్‌లు పూర్తిగా తగ్గకపోవడం వల్ల పెళ్లిళ్లు, ప్రయాణాల సమయంలో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి. చలికాలంలో ఎక్కువగా కదలకుండా ఉండటం వల్ల శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా ఇమ్యూనిటీ తగ్గడానికి కారణమవుతుంది. ఋతువులు మారుతున్నప్పుడు వాటికి శరీరం అలవాటు పడటంలో కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి.
అలాగే, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం, ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉండడం కూడా గొంతు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
ఈ సమస్యలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డీహైడ్రేషన్ రాకుండా ఉండేందుకు తగినంత నీరు తాగాలి. గోరువెచ్చని నీరు, హెర్బల్ టీలు, పసుపు పాలు వంటి పానీయాలు తీసుకుంటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కూల్ డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.
ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉండకుండా చూడాలి. జలుబు ఉన్నవాళ్ల దగ్గర ఉంటే మాస్క్ ధరించడం మంచిది. అలాగే నిమ్మకాయల వంటి విటమిన్ C ఉన్న పండ్లు, అల్లం, వెల్లుల్లి, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు 5–6 రోజులకు మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
