Medaram: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసి నెలరోజులు దాటినా కూడా భక్తుల రాక తగ్గలేదు. ప్రత్యేక దినాలు, సెలవు రోజుల్లో ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. అయితే భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారికి అవసరమైన సౌకర్యాలు మాత్రం సరిగా అందడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 28న మేడారాన్ని సందర్శించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అక్కడి భక్తుల రద్దీని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతర నాలుగు రోజులకే కాకుండా సంవత్సరం పొడవునా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కానీ ప్రస్తుతం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడారానికి వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి తర్వాత వనదేవతల దర్శనం చేసుకోవడం సంప్రదాయం. జాతర సమయంలో అధికారులు స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే జాతర ముగిసిన తర్వాత ఆ ఏర్పాట్లను తొలగించారు. ప్రస్తుతం వాగులో సరైన నీరు లేకపోవడంతో భక్తులు స్నానం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. బంట వంతెనల దిగువన, జంపన్న వాగు మరియు నాగులమ్మ గద్దె సమీపంలో షవర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అంటున్నారు.

ఇక తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. గత 20 ఏళ్లలో మేడారం మహాజాతర సమయంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ సుమారు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం భక్తులకు తాగడానికి సరైన నీరు అందడం లేదు. అలాగే వినియోగించుకునేలా మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవని భక్తులు చెబుతున్నారు. దీంతో రోజూ వచ్చే భక్తులు నీటిని బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, చిలకలగుట్ట, శివరాంసాగర్ చెరువు, కాల్వపల్లి క్రాస్ పరిసరాల్లో శాశ్వతంగా తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు మేడారం పరిసరాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన కళాకృతులతో అలంకరించిన కూడళ్లు కూడా ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఊరట్టం క్రాస్ రోడ్ నుంచి గజ్జెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, హరిత హోటల్, గిరిజన మ్యూజియం, రెడ్డిగూడెం ప్రాంతాల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ దీపాలు చాలా చోట్ల వెలగడం లేదు.
గద్దెల ప్రాంగణంలో కూడా సరైన నిర్వహణ లేకపోవడంతో భక్తులు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. బయట ఉండాల్సిన వ్యాపారులు గద్దెల వద్దకే వచ్చి వ్యాపారం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఖర్చు పెట్టి వచ్చే భక్తులకు శాశ్వతంగా సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
