Thalapathy Vijay: దళపతి విజయ్‌కు తమిళ సినీ అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వినిపించినా అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతారు. తమిళనాడులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన ‘జననాయగన్’ సినిమా ఆడియో లాంచ్‌ను మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో నిర్వహించడం కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణకు నిదర్శనం.
అయితే, ఇలాంటి భారీ క్రేజ్ ఉన్న విజయ్ వ్యక్తిగత జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఆ పిటిషన్లో విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారని తెలుస్తోంది. ఆ సంబంధం ముగిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, గత రెండేళ్లుగా తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నానని సంగీత పేర్కొన్నట్టుగా వార్తలు చెబుతున్నాయి. ఈ కేసు విషయంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరుకావాలని కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
సంగీత శ్రీలంక తమిళ మూలాలకు చెందినవారు. ఆమె యునైటెడ్ కింగ్డమ్లో పెరిగారు. 1999లో విజయ్ను వివాహం చేసుకున్నారు. ‘పూవే ఉనక్కగా’ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో వీరి పరిచయం ప్రారంభమైందని చెబుతారు. ఆ తరువాత ఈ పరిచయం ప్రేమగా మారి, ఇరు కుటుంబాల అంగీకారంతో 1999 ఆగస్టు 25న సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం జరిగింది. చెన్నైలో రిసెప్షన్ కూడా నిర్వహించారు. వీరికి ఇద్దరు సంతానం ఉంది. దాదాపు 27 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దాంపత్య జీవితంలో ఇప్పుడు కల్లోలం చెలరేగిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడన్న వార్తలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. అయితే కొందరు నెటిజన్లు జాసన్ అసలు విజయ్ అకౌంట్‌ను ఎప్పుడూ ఫాలో కాలేదని చెబుతున్నారు. దీంతో ఈ అన్‌ఫాలో వ్యవహారం నిజమా కాదా అన్నది స్పష్టత లేకుండా ఉంది.
ఇటీవల విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ప్రజల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితాన్ని సాధారణంగా బహిరంగ చర్చకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం విడాకుల వార్తలు, జాసన్ సంజయ్ అన్‌ఫాలో అంశం లాంటివన్నీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పటివరకు విజయ్ లేదా సంగీత నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక స్పందన కోసం వేచి చూడాల్సిందే. అంతవరకు ఇవన్నీ సోషల్ మీడియా ఊహాగానాలుగానే భావించాలి.
