Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సందడి మొదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూకట్‌పల్లిలోని ప్రముఖ అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ అభిమానులు ఆయనపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ పోషించిన పల్లెటూరి మాస్ రెజ్లర్ పాత్రను ప్రతిబింబించేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా, ఆ విగ్రహం ఉన్న ప్రదేశానికి ‘శ్రీ కొణిదెల రామ్ చరణ్ దేవాలయం’ అనే పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే అర్జున్ థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అభిమానులు రామ్ చరణ్ విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తూ, కర్పూర హారతులు ఇస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతూ, నినాదాలు చేస్తూ థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో ఉత్సాహం కనిపిస్తుండటంతో, విడుదల రోజు థియేటర్ల వద్ద మరింత భారీ స్థాయిలో అభిమానుల హంగామా ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
‘పెద్ది’పై ఇప్పటికే ఉన్న అంచనాలకు తోడు, అభిమానుల ఈ ప్రత్యేక వేడుకలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. విడుదల రోజు రామ్ చరణ్ అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Bigg Boss Telugu 10: ఈసారి హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు వీరేనా?
Peddi: ఇదెక్కడి మాస్ రా మామా.. రామ్ చరణ్‌కు గుడి కట్టిన అభిమానులు
