Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ మరో సమస్యను ఎదుర్కొంది. ఇప్పటికే చట్టపరమైన కారణాలతో సెన్సార్ ఆలస్యమవడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. విడుదలకు ముందే సినిమా పైరసీకి గురైంది.
గురువారం అర్ధరాత్రి నుంచే ఈ చిత్రానికి చెందిన కీలక సన్నివేశాలు, ఒక పాట ఆన్లైన్లో లీక్ అయ్యాయి. శుక్రవారం నాటికి పూర్తి సినిమా పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షమైంది. ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో, సినిమాను లీక్ చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. లీక్ అయిన కంటెంట్‌ను చూడడం, షేర్ చేయడం, డౌన్లోడ్ చేయడం కూడా నేరమేనని హెచ్చరించింది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని పేర్కొంది.
ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుండగా, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ లీక్ ఘటనపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “ఒక సినిమా అనేది ఎంతో మంది కృషి, నమ్మకం, కలల సమాహారం. ఇలాంటి లీక్‌లు మొత్తం పరిశ్రమపై ప్రభావం చూపుతాయి. పైరసీని అరికట్టడానికి మనందరం కలిసికట్టుగా నిలవాలి” అని పేర్కొన్నారు.
నటుడు మోహన్ బాబు ఈ ఘటనను “సిగ్గుచేటైన ద్రోహం”గా అభివర్ణిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హీరో సూర్య మాట్లాడుతూ, “ఒక సినిమా కోసం పనిచేసిన మొత్తం టీమ్ కృషి ఈ లీక్ వల్ల నష్టపోయింది. దయచేసి పైరసీ కంటెంట్‌ను చూడకండి, పంచుకోకండి” అని కోరారు.
హీరో కార్తి, “ఇది మొత్తం సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఘటన” అని వ్యాఖ్యానించగా, శివకార్తికేయన్ “ప్రతి సినిమా వెనుక వందలాది మంది శ్రమ ఉంటుంది. పైరసీకి దూరంగా ఉండండి” అని పిలుపునిచ్చారు.
ఈ ఘటనను దర్శకులు శ్రీను వైట్ల, రాజ్‌కుమార్ పెరియసామి, హెచ్. వినోద్, అలాగే హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్, విజయ్ ఆంటోని తదితరులు కూడా ఖండించారు.
మొత్తంగా ‘జన నాయగన్’ లీక్ ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది. పైరసీపై కఠిన చర్యలు అవసరమని మరోసారి స్పష్టమైంది.
