Bigg Boss Telugu 10: ఈసారి హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు వీరేనా?

Bigg Boss Telugu 10 Contestants List Revealed?

Bigg Boss Telugu 10 Contestants List Revealed?

Bigg Boss Telugu 10: తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి పదో సీజన్‌పై ఉంది. బిగ్ బాస్ 10 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈసారి షోను కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.

సమాచారం ప్రకారం, సీజన్ 10 కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సీజన్‌ను ప్రత్యేకంగా రూపొందించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి సెలబ్రిటీల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

గత సీజన్ల మాదిరిగానే సామాన్యులకు కూడా అవకాశం కల్పించేలా ‘అగ్నిపరీక్ష’ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ 10లో పాల్గొనబోతున్నారంటూ పలువురు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిరుపమ్ పరిటాల – ప్రేమి విశ్వనాథ్

‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు, వంటలక్కగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ పేర్లు ఈసారి బిగ్ బాస్ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘కార్తీక దీపం 2’తో బిజీగా ఉన్న ఈ జంట నిజంగా షోలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మహేష్ ఆచంట

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ‘రంగస్థలం’ సినిమాతో మరింత పాపులర్ అయిన నటుడు మహేష్ ఆచంట పేరు కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశముందని అంటున్నారు.

వాసుకి ఆనంద్

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోల చెల్లెలి పాత్రలతో గుర్తింపు పొందిన వాసుకి ఆనంద్, ఇటీవల ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ఆమె పేరు కూడా కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తోంది.

ఇంద్రనీల్

‘రుతురాగాలు’, ‘చక్రవాకం’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఇంద్రనీల్ కూడా ఈసారి బిగ్ బాస్‌లో కనిపించే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఆయన ఒంటరిగా వస్తారా, లేక భార్య మేఘన రామితో కలిసి వస్తారా అనేది తెలియాల్సి ఉంది.

కస్తూరి

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కస్తూరి పేరు కూడా బిగ్ బాస్ 10 కోసం వినిపిస్తోంది. గతంలో తమిళ బిగ్ బాస్‌లో పాల్గొన్న ఆమె, ఈసారి తెలుగు వెర్షన్‌లో సందడి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

బమ్ చిక్ బబ్లూ

సోషల్ మీడియా, వెబ్ సిరీస్‌ల ద్వారా పాపులర్ అయిన సాయి కుమార్ బబ్లూ అలియాస్ ‘బమ్ చిక్ బబ్లూ’ పేరు కూడా జాబితాలో ఉంది. గతంలో కూడా ఆయన పేరు వినిపించినప్పటికీ అవకాశం రాలేదు. ఈసారి మాత్రం హౌస్‌లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

రక్ష గౌడ

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటి రక్ష గౌడ కూడా ఈసారి బిగ్ బాస్‌లో పాల్గొనవచ్చని ప్రచారం సాగుతోంది. గత సీజన్లలో కూడా ఆమె పేరు వినిపించినప్పటికీ, ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మరికొన్ని పేర్లు కూడా చర్చలో…

వీళ్లతో పాటు యాంకర్ దీపికా పిల్లి, జబర్దస్త్ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, టీవీ నటి ఆషికా పడుకొనే, ఫోక్ సింగర్ మంగ్లీ, సీరియల్ నటీమణులు తేజస్వీ గౌడ, కావ్య పేర్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ జాబితాపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఈ పేర్లలో ఎంతమంది నిజంగా హౌస్‌లోకి అడుగుపెడతారు, ఫైనల్ కంటెస్టెంట్ల జాబితాలో ఎవరు ఉంటారు అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ తెలుగు 10పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Also Read: Health: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

Bigg Boss Telugu 10: ఈసారి హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు వీరేనా?