Tragedy: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కుదిరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి, కూతురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ద్రోణాదుల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు మరియు సుజాత (46) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, దివ్య గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది.
దివ్యకు మార్టూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయించారు. గత సంవత్సరం డిసెంబర్ 14న ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా, ఈ నెల 4వ తేదీన వరుడు దివ్యను మరియు ఆమె తల్లిదండ్రులను మాట్లాడాలంటూ మార్టూరులోని తన ఇంటికి పిలిపించాడు.
ఆ సమయంలో అతను దివ్య హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రహస్యంగా ఆమెను అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపిస్తూ పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేశాడు. ఈ ఘటనతో దివ్య, ఆమె తల్లి సుజాత తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారు.
దీంతో ఇద్దరూ మార్టూరులోనే ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల గ్రామానికి వచ్చి వాటిని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన భర్త శ్రీనివాసరావు వెంటనే వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు మార్చారు.
గత వారం రోజులుగా ఇద్దరూ చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. గురువారం తెల్లవారుజామున దివ్య ఉదయం 5 గంటల సమయంలో మృతి చెందగా, అదే రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత కూడా ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై సుజాత భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. అనంతరం ఈ విషయాన్ని మార్టూరు పోలీసులకు తెలియజేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
