Srilanka: ఛీ ఛీ ఇదేం పాడు బుద్ది.. మహిళలు స్నానం చేస్తుండగా.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!

Srilanka: శ్రీలంక క్రికెట్‌లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దేశానికి చెందిన ఇద్దరు అండర్-19 క్రికెటర్లు తీవ్రమైన ఆరోపణలతో పోలీసుల చేతికి చిక్కారు. మహిళా వైద్యులు స్నానం చేస్తున్న సమయంలో హోటల్ బాత్‌రూమ్‌లలో రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.

కొలంబోలోని నారాహెన్‌పిటా ప్రాంతంలోని ఒక హోటల్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌కు పలువురు లేడీ డాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఎవరో మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో ఈ ఘటనకు అండర్-19 క్రికెటర్లే కారణమని పోలీసులు గుర్తించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే మెజిస్ట్రేట్ వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పూచీకత్తుతో, ఇద్దరు వ్యక్తుల జామీనుపై బెయిల్ మంజూరు చేశారు.

ఇక పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ క్రికెటర్లు మహిళలతో పాటు కొంతమంది పురుషుల వీడియోలను కూడా రహస్యంగా చిత్రీకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలు ఎక్కడైనా ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయా లేదా అన్న విషయంపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా, నిందితులను జోసెఫ్, వాజ్‌లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: Viral: అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు

Srilanka: ఛీ ఛీ ఇదేం పాడు బుద్ది.. మహిళలు స్నానం చేస్తుండగా.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!