Raj Reddy Siri Alexa Creator: కాటూరు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మారుమూల పల్లె. అక్కడ కరెంటు లేదు, మంచినీళ్ల పైపు లేదు, స్కూల్లో బల్లలు లేవు. ఆ ఊరి ఒక గది బడిలో ఒక పిల్లాడు ఇసుకలో వేలితో అ ఆ లు రాస్తున్నాడు. ఎందుకంటే కాగితం, పెన్సిల్ కొనడానికి కూడా డబ్బులు లేవు.
ఆ పిల్లాడి పేరు రాజగోపాల్. 16 ఏళ్ల వరకు కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతని నాన్న శ్రీనివాసులు రెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉంది. నలుగురు కొడుకుల్లో ఈ మూడోవాడు చదువులో అంత షార్ప్ కాదేమో అనుకున్నాడు. “పొలం చూసుకోవడానికి ఒకడు ఉండాలి, నువ్వే ఉండు” అని పెద్దోళ్లను కాలేజీకి పంపి, ఈ పిల్లాడిని పల్లెలోనే ఉంచాలనుకున్నాడు. కానీ విధి వేరేలా రాసింది.
“వీడు ఇక్కడికి పనికిరాడు, చదువుకోనివ్వండి” అన్న మాటే ఆ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. 9 ఏళ్ల వయసులో శ్రీకాళహస్తికి పంపించారు. 8 మైళ్ల దూరం, 2 నెలలకోసారి ఇంటికి రావడం. డబ్బులు లేక న్యూస్ పేపర్ కొనలేక, షాపు బయట వేలాడదీసిన పేపర్ ని బడికి వెళ్తూ చదివేవాడు. అదే ఆకలి అతన్ని మద్రాస్ లో సివిల్ ఇంజనీర్ ని చేసింది.

అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆస్ట్రేలియాలో ఒక రోజు హాస్టల్ లో భోజనం చేస్తున్నప్పుడు మెనూలో “స్టీక్” అని ఉంది. అదేంటో తెలియక తినబోతే అది గొడ్డు మాంసం అని తెలిసి, బ్రెడ్, జామ్ తిని పడుకున్నాడు. ఆ రోజు నుండే అతని పేరు Dabbala Rajagopal నుండి “Raj Reddy” అయ్యింది.
అక్కడే మొదటిసారి కంప్యూటర్ ని చూశాడు. వెయ్యి బైట్ల మెమొరీ ఉన్న ఆ పెద్ద పెట్టె. ప్రోగ్రామింగ్ ఎవరూ నేర్పలేదు, చూసి నేర్చుకున్నాడు. ఆ కంప్యూటర్ మనిషి మాట వింటుందా? అనే ప్రశ్న అతన్ని అమెరికా తీసుకెళ్లింది. స్టాన్‌ఫోర్డ్ లో రాత్రి 4 గంటల నుండి తెల్లారి 8 గంటల వరకు ల్యాబ్ లోనే ఉండేవాడు. గంటకు 10 వేల డాలర్ల కంప్యూటర్ ని ఫ్రీగా వాడుతున్నందుకు “స్వర్గంలో ఉన్నట్టు ఉంది” అని డైరీలో రాసుకున్నాడు.
అతను తయారు చేసిన Hearsay, Dragon, Harpy అనే సిస్టమ్స్ వల్లే ఈరోజు నువ్వు “Hey Siri” అంటే నీ ఫోన్ పలుకుతోంది. ఆ ఇసుకలో అక్షరాలు రాసిన కుర్రాడే 1994లో కంప్యూటర్ ప్రపంచ నోబెల్ – Turing Award – గెలిచిన మొదటి ఆసియన్ అయ్యాడు. అతని తండ్రి “నువ్వు ఇక్కడికి అవసరం లేదు” అని పంపిస్తే, అతను ప్రపంచానికే అవసరమైన మనిషి అయ్యాడు. ఇదే రాజ్ రెడ్డి కథ.
Also Read: TTD Bans Cauliflower: తిరుమలలో కాలీఫ్లవర్‌పై టీటీడీ నిషేధం.. అసలు కారణం ఇదే!
