Viral: అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు

Unbelievable! In Odisha, Man Carries Sister's Skeleton To Bank To Claim Rs 19,300 Balance — Video

Unbelievable! In Odisha, Man Carries Sister's Skeleton To Bank To Claim Rs 19,300 Balance — Video

Viral: ఒడిశా రాష్ట్రంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరి మరణాన్ని నిరూపించడానికి ఓ గిరిజనుడు చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది.

కియోంఝర్ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50)కి, కాల్రా ముండా (56) అనే సోదరి ఉంది. ఆమెకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండేది. పశువులు అమ్మి వచ్చిన డబ్బును ఆమె ఆ ఖాతాలో జమ చేసుకుంది. అయితే అనారోగ్యం కారణంగా కాల్రా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక కుమారుడు ముందుగానే మరణించడంతో, చనిపోవడానికి ముందు తన ఖాతాలో ఉన్న రూ.19,300ను సోదరుడు జీతూ తీసుకోవాలని చెప్పింది.

ఈ నేపథ్యంలో జీతూ బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాంకు అధికారులు ఖాతాదారు ప్రత్యక్షంగా రావాలని లేదా మరణ ధ్రువీకరణ పత్రం, లేదా వారసత్వాన్ని నిరూపించే పత్రాలు తీసుకురావాలని చెప్పారు. నిరక్షరాస్యుడైన జీతూకి అలాంటి పత్రాలు లేకపోవడంతో, ప్రతి సారి బ్యాంకుకు వెళ్లి తన పరిస్థితిని వివరించి డబ్బులు ఇవ్వమని వేడుకునేవాడు.

అయితే అధికారులు సరైన ఆధారం లేకుండా డబ్బులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీనితో జీతూ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. శ్మశానవాటికకు వెళ్లి తన సోదరి సమాధిని తవ్వి, అస్తిపంజరాన్ని బయటకు తీశాడు. దాన్ని భుజాన వేసుకుని సుమారు మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు తీసుకెళ్లాడు. “ఇదిగో నా అక్క అస్తిపంజరం… ఇప్పుడు ఆమె చనిపోయిందని నమ్ముతారా?” అని అడిగాడు.

ఈ ఘటనతో బ్యాంకు అధికారులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో ఆ అస్తిపంజరాన్ని మళ్లీ శ్మశానవాటికలో ఖననం చేశారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కాల్రా ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును వడ్డీతో కలిపి జీతూకు అందజేసినట్లు తెలిపారు. రూ.19,300కు వడ్డీతో కలిపి రూ.19,402 మంగళవారం అతనికి ఇచ్చారు. అదనంగా, జిల్లా యంత్రాంగం రెడ్‌క్రాస్ నిధి నుంచి జీతూ ముండాకు రూ.30,000 ఆర్థిక సహాయం కూడా అందించింది.

Also Read: Temple: గుడి నుంచి రాగానే స్నానం చేస్తున్నారా..?

Viral: అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు