Gas Crisis: గ్యాస్ కొరత‌.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?

Will Your Mobile And Internet Services Get Affected Amid LPG Shortage?

Will Your Mobile And Internet Services Get Affected Amid LPG Shortage?

Gas Crisis: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తీవ్రంగా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరాపై పడుతోంది. దాని ప్రభావం భారత్‌పైనా కొంతమేర కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ (LPG) సరఫరా విషయంలో కొంత ఒత్తిడి కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ వినియోగించే హోటల్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు కూడా సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఎల్‌పీజీ కొరత ప్రభావం కేవలం వంటగ్యాస్‌కే పరిమితం కాకుండా ఇతర రంగాలపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టెలికాం రంగంపై కూడా దీని ప్రభావం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

టెలికాం టవర్ల తయారీ ప్రక్రియలో ఎల్‌పీజీ కీలక పాత్ర పోషిస్తుంది. టవర్లు తుప్పు పట్టకుండా ఉండేందుకు వాటిపై జింక్‌తో రక్షణ పొర వేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. ఈ గాల్వనైజేషన్ సమయంలో ఎల్‌పీజీ వాడతారు. అయితే ప్రస్తుతం టెలికాం టవర్ తయారీ సంస్థలకు సరఫరా అయ్యే గ్యాస్ తగ్గిపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తగినంత LPG అందకపోతే గాల్వనైజేషన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చే అవకాశం ఉందని తయారీ సంస్థలు అంటున్నాయి. అలా జరిగితే టెలికాం టవర్‌ల తయారీ మరియు నెట్‌వర్క్ విస్తరణ నెమ్మదించే ప్రమాదం ఉంది. దీని ప్రభావం మొబైల్ నెట్‌వర్క్ మరియు ఇంటర్నెట్ సేవలపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సేవలు అనేక రంగాలకు కీలకం. బ్యాంకింగ్, ఐటీ, ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఈ రంగంలో సమస్యలు వస్తే దేశవ్యాప్తంగా అనేక సేవలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎల్‌పీజీ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా LPG ఉత్పత్తిని సుమారు 10 శాతం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ చర్యల ద్వారా ఎల్‌పీజీ కొరతను తగ్గించి, గృహ వినియోగం నుంచి పరిశ్రమల వరకు అన్ని రంగాలకు సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

Also Read: LPG Shortage: గ్యాస్ కొరత.. హోటళ్లు బంద్..!

Gas Crisis: గ్యాస్ కొరత‌.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?