Hyderabad: నగరవాసులందరికీ ఇష్టమైన సాయంత్రపు స్నాక్ ‘సమోసా’ ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. లాభాల కోసం కొంతమంది అక్రమార్కులు ప్రజల ఆరోగ్యంతో ప్రమాదకరంగా ఆటలాడుతున్న ఘటన జియాగూడ బైపాస్ రోడ్డులో వెలుగుచూసింది.
కుల్సుంపురా పోలీసులు శుక్రవారం సాయంత్రం మూసీ తీరంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఒక అక్రమ సమోసా తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఇన్స్‌పెక్టర్ రాములు, ఎస్సై నర్సింహా ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో అక్కడి పరిస్థితులు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
గోల్కొండకు చెందిన అబ్దుల్ రషీద్ (73) ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దాడి సమయంలో బయటపడిన విషయాలు మరింత షాక్‌కు గురిచేశాయి. సమోసాల తయారీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు ఉపయోగిస్తున్నారని తేలింది. అలాగే పలుమార్లు వాడి నల్లగా మారిన కల్తీ నూనెను వంటకు వినియోగిస్తున్నారు. ఎక్స్‌పైరీ డేట్ దాటిన మైదా పిండి, పురుగులు పట్టిన పదార్థాలు కూడా నిల్వ ఉంచి వాడుతున్నారు. మార్కెట్‌లో పారేసిన కుళ్లిన కూరగాయలను తీసుకొచ్చి వాటితో మసాలా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేంద్రం నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో సమోసాలు తయారవుతున్నాయి. వీటిని నగరంలోని చిన్న హోటళ్లు, బేకరీలు, రోడ్డు పక్కన బండ్లపై విక్రయించే వ్యాపారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరలో లభిస్తాయని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, అవే సమోసాలను ప్రజలకు విక్రయిస్తున్నారు. దీంతో విద్యార్థులు, సాధారణ ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ దాడిలో పోలీసులు భారీగా కల్తీ మైదా, నూనె డబ్బాలు, కుళ్లిన గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ రషీద్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి ఎటువంటి అనుమతులు లేవని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు బయట ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కన, చిన్న బేకరీల్లో దొరికే తక్కువ ధర స్నాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అపరిశుభ్రమైన ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
నగరంలో ఇలాంటి అక్రమ ఆహార తయారీ కేంద్రాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
