Registration: వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

Registration Services Directly on WhatsApp

Registration Services Directly on WhatsApp

Registration: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా మరో కీలక అడుగు వేసింది. రిజిస్ట్రేషన్,  స్టాంపుల శాఖ సేవలను ఇప్పుడు నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా పౌరులు తమ మొబైల్ నుంచే అనేక సేవలను సులభంగా పొందవచ్చు.

ఈ సేవలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో ప్రారంభించారు. మీసేవ కమిషనర్ టి. రవికిరణ్ తెలిపిన ప్రకారం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC), స్టాంపుల కొనుగోలు వంటి సేవలను ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లకుండానే పొందే అవకాశం కల్పించారు. ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించి, ధృవీకరణ పత్రాలను నేరుగా వాట్సాప్‌లోనే పొందవచ్చు.

ఈ వినూత్న సేవలు 2025 నవంబర్ 18న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా సేవలను అందించడమే ఈ విధానం లక్ష్యం. వినియోగదారులు తమ ఫోన్‌లో ఈ నంబర్ సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపితే చాట్‌బాట్ ద్వారా అవసరమైన సేవలను ఎంచుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు:

  • రిజిస్ట్రేషన్ పత్రాల సర్టిఫైడ్ కాపీలు
  • ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC)
  • స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్
  • డెఫిసిట్ చెల్లింపులు
  • సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్
  • అపరాధ రుసుములు చెల్లింపు
  • సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తులు

సేవను ఎంచుకుని, అవసరమైన వివరాలు నమోదు చేసిన తర్వాత ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. అధికారుల ఆమోదం వచ్చిన వెంటనే సంబంధిత పత్రాలు వాట్సాప్‌లో అందుతాయి. కొన్ని సేవలకు సంబంధించిన పత్రాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్వీకరించాల్సి ఉంటుంది.

ఇకపోతే, మీసేవ కేంద్రాల్లో సేవల ఛార్జీలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. ముందు రూ.35 ఉన్న కనీస సేవా రుసుమును రూ.62కు పెంచారు. కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల ధరలను రూ.80కు పెంచగా, జనన సర్టిఫికేట్ ప్రింట్‌కు రూ.62 వసూలు చేస్తున్నారు. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈ పెంపు వల్ల విద్యార్థులు, పేద మరియు మధ్యతరగతి ప్రజలపై కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా కావడంతో పాటు కార్యాలయాల వద్ద రద్దీ కూడా తగ్గనుంది.

Also Read: Aloe Vera Juice: వేసవిలో అలోవెరా జ్యూస్ తాగుతున్నారా..?

Registration: వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!