Mangli: తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం.. కంటతడి పెట్టిన మంగ్లీ

Singer Mangli crying infront of media

Singer Mangli crying infront of media

Mangli: తన జానపద పాటలతో, ఉత్సాహభరితమైన గాత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగర్ మంగ్లీ (సత్యవతి రాథోడ్) ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా ఆమెపై వస్తున్న ఆరోపణలు ఆమెను మానసికంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రూ. 10 కోట్ల మోసం కేసులో ఆమె పేరు వినిపించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, సుమారు 10 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అయితే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ ఇప్పటికే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.

ఇటీవల మంగ్లీ మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యమని ఆమె స్పష్టం చేశారు. “నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇతరులను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నాకు చాలానే పని ఉంది, ప్రజల ప్రేమ ఉంది” అని ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా సుబ్బారావు గురించి కూడా మంగ్లీ కొన్ని విషయాలు వెల్లడించారు. “ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. బిగ్ బాస్‌కు వెళ్లాలనే ఆశ ఉంది. యాంకర్ శ్రీముఖిపై క్రష్ కూడా ఉంది. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో పలు మీడియా ఛానళ్లను సంప్రదించారు. అది సాధ్యం కాకపోవడంతో, నా పేరును ఉపయోగించి ప్రచారం పొందాలని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు” అని ఆమె ఆరోపించారు.

తాను తప్పు చేశానని ఎవరైనా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అవసరమైతే కోర్టుల వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మంగ్లీ తెలిపారు. తాను ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేనని, తనకు పాటే ముఖ్యమని స్పష్టం చేశారు. “ఎన్నికల సమయంలో ప్రచారం చేయమని కోట్ల రూపాయలు ఇచ్చినా నేను అంగీకరించలేదు. అలాంటిదే నాకు ఈ 10 కోట్లు పెద్ద విషయం కాదు. కేవలం నన్ను బెదిరించి డబ్బులు తీసుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారు” అని ఆమె అన్నారు.

సోషల్ మీడియా తన జీవితంలో ఇంత ప్రభావం చూపుతుందని ఊహించలేదని మంగ్లీ అన్నారు. నిజం తెలుసుకోకుండా తనపై ఆరోపణలు చేయవద్దని, తప్పుడు వార్తలను ప్రచారం చేయకూడదని మీడియా, ప్రజలను కోరారు. అలాగే, తన పేరును వాడుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

Also Read: Inter Results 2026: నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

Mangli: తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం.. కంటతడి పెట్టిన మంగ్లీ