Asha Bhosle: భారతీయ సినీ సంగీత ప్రపంచానికి చెందిన లెజెండరీ గాయని ఆశా భోస్లే మరణం సంగీత ప్రియులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గత కొన్ని రోజులుగా గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ, సంగీత రంగాల్లో దిగ్భ్రాంతి వ్యక్తమైంది. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఆశా భోస్లే అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబం వెల్లడించింది.
1933లో సంగీత సంప్రదాయానికి పేరుగాంచిన మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా భోస్లే, చిన్న వయస్సులోనే గానప్రస్థానం ప్రారంభించారు. అక్క లతా మంగేష్కర్తో కలిసి భారతీయ సంగీతానికి రెండు కళ్లుగా నిలిచిన ఆమె, 1943లో తన తొలి పాటను రికార్డ్ చేసి సినీరంగంలో అడుగుపెట్టారు.
ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రయాణంలో వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భాషల్లో ఆమె స్వరం మార్మోగింది. మెలోడీ పాటల నుంచి క్యాబరే, క్లబ్ సాంగ్స్ వరకు అన్ని రకాల పాటల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
“దిల్ చీజ్ క్యా హై”, “మేరా కుచ్ సామాన్” వంటి పాటలకు ఆమె రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గాయని అవార్డు గెలుచుకుని తన ప్రతిభను నిరూపించారు.
సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్తో ఆమె కలయిక ప్రత్యేకంగా నిలిచింది. “దమ్ మారో దమ్”, “పియా తూ అబ్ తో ఆజా”, “చురా లియా హై తుమ్నే” వంటి పాటలు తరతరాలకు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ జంట భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆశా భోస్లే తనను తాను ఎప్పటికీ విద్యార్థినిగానే భావిస్తానని తెలిపారు. పాటలు వినేటప్పుడు భీమ్సేన్ జోషి వంటి దిగ్గజాల గానాన్ని ఆస్వాదిస్తూ, వాటి ద్వారా తన గాన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటానని చెప్పారు. నేటి తరం గాయకుల్లో సునీధి చౌహాన్, రాహత్ ఫతే అలీ ఖాన్ వంటి వారి గానం తనకు నచ్చుతుందని కూడా ప్రశంసించారు.
