Chewing Gum: చూయింగ్ గమ్ నమలడం పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో కనిపించే అలవాటు. కొందరు స్టైల్ కోసం తింటే, మరికొందరు అలవాటుగా నములుతుంటారు. అయితే చూయింగ్ గమ్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో, కొంతవరకు బరువు నియంత్రణలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ దీన్ని నమిలేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ప్రత్యేకంగా చిన్నపిల్లలు తెలియక గమ్‌ను మింగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. సాధారణంగా చూయింగ్ గమ్ జిగటగా, సాగదీయగలిగినదిగా ఉండటం వల్ల అది కడుపులోనే ఉండిపోతుందని, పేగుల్లో అడ్డంకి కలిగిస్తుందని కొందరు భావిస్తారు. అలాగే ఇది ఏడేళ్ల వరకు జీర్ణవ్యవస్థలోనే ఉంటుందనే అపోహ కూడా ఉంది.
కానీ వాస్తవం ఏమిటంటే చూయింగ్ గమ్ జీర్ణం కాదు, అలాగే కడుపులో కరగదు. మన శరీరం దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేకంగా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయదు. అయినప్పటికీ, అది చాలా కాలం కడుపులో ఉండిపోదు. సాధారణంగా కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో జీర్ణవ్యవస్థ గుండా ప్రయాణించి, మలంతో కలిసి బయటకు వెళ్లిపోతుంది.
అయితే అరుదుగా గమ్ పేగులకు అంటుకునే పరిస్థితి ఏర్పడితే సమస్యలు రావచ్చు. అలా జరిగితే వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నిపుణుల ప్రకారం, చూయింగ్ గమ్ కూడా ఫైబర్ లాంటి పదార్థమే. ఇది కరగదు కానీ శరీరం నుంచి బయటకు వెళ్తుంది. అయినప్పటికీ దీన్ని ఎక్కువగా తినడం మంచిది కాదు. తరచుగా నమిలే అలవాటు ఉంటే అనుకోకుండా మింగే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య పిల్లలలో మాత్రమే కాకుండా పెద్దల్లో కూడా కనిపించవచ్చు. కాబట్టి చూయింగ్ గమ్‌ను మితంగా ఉపయోగించడం ఉత్తమం.
