Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని చాలా మంది చెబుతుంటారు. పెద్దలు కూడా ఇదే విషయాన్ని తరచూ హెచ్చరిస్తారు. దీనికి పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా లేకపోయినా, వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా మనం ఏ ఆహారం తీసుకున్నా, దాన్ని జీర్ణం చేయడానికి కడుపులో జఠరాగ్ని (జీర్ణ అగ్ని) పనిచేస్తుంది. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగితే ఈ జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. మామిడి పండ్లు తిన్న తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చు. నీళ్లు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్స్ మరియు గ్యాస్ట్రిక్ యాసిడ్స్ డైల్యూట్ అయ్యి, ఆహారం సరిగా అరగక అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.
మామిడి పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ షుగర్ శరీరంలోని నీటిని ఆకర్షించడంతో కొంత డీహైడ్రేషన్ ఏర్పడి వెంటనే దాహం వేస్తుంది. కొందరికి నాలుకపై స్వల్ప గిరగిరలాడే భావన లేదా అసౌకర్యం కూడా కలుగుతుంది. అందుకే వెంటనే నీళ్లు తాగాలనిపిస్తుంది.
అయితే పండ్లలో ఇప్పటికే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మామిడి తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో నీటి మోతాదు ఒక్కసారిగా పెరిగి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గ్యాస్, కడుపు మంట, త్రేన్పులు వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో విరేచనాలు కూడా రావచ్చు.
మామిడి పండ్లు జీర్ణం కావడానికి శరీరంలో ప్రత్యేక ఎంజైమ్స్ పనిచేస్తాయి. కానీ వెంటనే నీళ్లు తాగితే ఇవి ప్రభావితం అవుతాయి. దాంతో గ్యాస్ ఏర్పడి అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా తీపి ఎక్కువగా ఉన్న మామిడి తిన్నప్పుడు ఇది మరింత ప్రభావం చూపుతుంది.
అందువల్ల మామిడి పండు తిన్న తర్వాత కనీసం 20–30 నిమిషాలు ఆగి తర్వాత నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చాలా దాహంగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు మాత్రమే తీసుకోవాలి.
మామిడి మాత్రమే కాదు, ఆరెంజ్, పుచ్చకాయ, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగితే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సరైన జీర్ణం కోసం కడుపులోని పీహెచ్ స్థాయి సమతుల్యంగా ఉండాలి. కానీ వెంటనే నీళ్లు తాగడం వల్ల అది మారి అజీర్తి సమస్యలు తలెత్తవచ్చు.
ఇంతకీ మామిడి పండ్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి విటమిన్ A, C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్తో సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పరిమితంగా తినడం మంచిది.
గమనిక:
పై సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏ ఆరోగ్య సమస్యలైనా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
