Instagram: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అవుతున్నారు. యూజర్లు కూడా తమకు నచ్చిన కంటెంట్‌ను గంటల తరబడి చూస్తూ ఉంటారు. దీంతో ఈ ప్లాట్‌ఫామ్ కంటెంట్ క్రియేటర్లకు మంచి అవకాశంగా మారింది. ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఎదిగి కొందరు లక్షలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే, అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు:
1. స్పాన్సర్డ్ కంటెంట్
ఇన్‌స్టాగ్రామ్‌లో #Ads, #Sponsored అనే ట్యాగ్‌లతో కనిపించే పోస్టులు సాధారణంగా బ్రాండ్ల ప్రమోషన్ కోసం ఉంటాయి. ఇన్‌ఫ్లూయెన్సర్లు కంపెనీలతో కలిసి వారి ఉత్పత్తులు, సేవలను తమ ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తారు. దీనికి బదులుగా కంపెనీలు వారికి మంచి మొత్తంలో పారితోషికం ఇస్తాయి.
2. అఫిలియేట్ పార్టనర్‌షిప్
ఇన్‌ఫ్లూయెన్సర్లు వివిధ బ్రాండ్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో అఫిలియేట్ అవుతారు. తమ పేజీలో ప్రొడక్ట్ లింక్స్ లేదా డిస్కౌంట్ కోడ్స్ షేర్ చేస్తారు. ఆ లింక్ ద్వారా కొనుగోలు జరిగితే వారికి కమీషన్ వస్తుంది. ఇది సాధారణంగా 5% నుంచి 30% వరకు ఉంటుంది.
3. బోనస్ & ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్
ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. ఇందులో భాగంగా పోస్టులు, రీల్స్ ద్వారా వ్యూస్ లేదా ఎంగేజ్‌మెంట్ ఆధారంగా బోనస్‌లు అందిస్తారు. అయితే ఇవి ఎక్కువగా క్రియేటర్ లేదా బిజినెస్ అకౌంట్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
4. యూజర్ జనరేటెడ్ కంటెంట్ (UGC)
కంపెనీలు నేరుగా యాడ్స్ చేయకుండా, ఇన్‌ఫ్లూయెన్సర్ల చేత కంటెంట్ తయారు చేయిస్తాయి. ఈ కంటెంట్ సహజంగా కనిపించేలా ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ స్టైల్‌లో రీల్స్ లేదా పోస్టులు చేసి బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు. ఈ విధంగా కూడా మంచి ఆదాయం పొందవచ్చు.
5. డొనేషన్స్ & గిఫ్ట్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ నుంచి డైరెక్ట్‌గా గిఫ్ట్స్, డొనేషన్స్ పొందే అవకాశం కూడా ఉంది. యూజర్లు ‘స్టార్స్’ కొనుగోలు చేసి క్రియేటర్లకు పంపుతారు. ఒక్క స్టార్ విలువ సుమారు 0.01 డాలర్ (దాదాపు ₹0.80) ఉంటుంది.
6. రీల్స్ ద్వారా ఆదాయం
చాలామంది తమ సొంత ప్రొడక్టులను రీల్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు. వీడియో కింద కొనుగోలు లింక్ లేదా కాల్-టూ-యాక్షన్ ఉంచుతారు. దీనివల్ల ఎవరైనా కొనుగోలు చేస్తే డబ్బు నేరుగా క్రియేటర్‌కు చేరుతుంది.
గమనిక:
సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయడం సులభమే కానీ పాపులర్ అవడం అంత తేలిక కాదు. దీనికి క్రమం తప్పకుండా కంటెంట్ క్రియేట్ చేయడం, క్రియేటివిటీ, సహనం చాలా అవసరం. చదువు లేదా ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సోషల్ మీడియాపై ఆధారపడడం మంచిది కాదు. దీన్ని ఒక సైడ్ ఇన్‌కమ్‌గా చూడటం మంచిది.
