UP Viral: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో ఇచ్చి పెళ్లి చేశాడంటూ విపరీతంగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. దాదాపు 21 ఏళ్ల క్రితం ఓ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలం నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అదే గ్రామానికి చెందిన తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో తన భార్యకు సంబంధం ఉన్నట్టు భర్తకు తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు తీవ్రమై రెండు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అందిన సమాచారం ప్రకారం, ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.
మళ్లీ ఈ మధ్యే ఆ మహిళ తన అత్తారింటికి వచ్చింది. దీంతో ఆ భార్యాభర్తల మధ్య మరోసారి తగవు చెలరేగింది. ఆ తర్వాత వారిరువురి బంధువులు, గ్రామ పెద్దలు కలిసి సమావేశమై.. ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళ మాత్రం తన ప్రియుడితోనే ఉండాలని డిసైడ్ చేసుకుంది. ఇక చేసేదం లేక భర్త కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించి సాగనంపినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు భర్త తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరేమో పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై అధికారులు స్పందిస్తేనే అసలేం జరిగిందో అర్థమవుతుంది. కావున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని ఇప్పుడే నిజమని భావించలేం.
Also Read: Online Funeral: తండ్రికి ఆన్‌లైన్ అంత్యక్రియలు.. ముగ్గురు కూతుర్లున్నా వేస్ట్..!
