Online Funeral: తండ్రికి ఆన్‌లైన్ అంత్యక్రియలు.. ముగ్గురు కూతుర్లున్నా వేస్ట్..!

online funeral for father in haryana

Online Funeral: చిన్నప్పట్నుంచి కష్టపడి పెంచి, సాకి.. పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే.. కనీసం బుక్కెడు తిండి పెట్టడానికి కూడా వంతులు వేసుకుంటున్న రోజులివి. తమ కష్టాన్ని అంతా ధారపోసి, ఉన్నత చదువులు చెప్పించిన కొందరు తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కన్నతండ్రిని కడసారి కూడా చూడలేని స్థితిలో బిడ్డలు ఉండడం నిజంగా ఆ తండ్రి చేసుకున్న దౌర్భాగ్యమే. చెప్పుకునేందుకు ముగ్గురు కూతుర్లు ఉన్నా.. అంత్యక్రియలకు రావడానికి కూడా రాకపోవడం అత్యంత దయనీయం. మానవ సంబంధాలు రోజురోజుకూ ఎంత దిగజారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

హరియాణాలోని సోనిపట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలో ఒకప్పుడు ప్రముఖ బట్టల వ్యాపారిగా ఉన్న శివచరణ్ గుప్తా తన ముగ్గురు పిల్లలను ఎంతో గారాబంగా పెంచి, పెద్ద చేశాడు. ఉన్నత చదువులు చెప్పించాడు. కానీ అంతలోనే అనారోగ్యం చెంత చేరింది. ఒంటరితనమే తోడుగా మారింది. కష్టకాలంలో శివచరణ్ గుప్తా తన భార్యతో కలిసి సోనిపట్ వృద్ధాశ్రమానికి చేరారు. ఓ పక్క వృద్ధాప్యం, మరో పక్క అనారోగ్యం దరి చేరడంతో.. తన ఆఖరి ఘడియల్లోనైనా కన్నకూతుళ్లను చూడాలని ఆశపడ్డాడు.

Daughters Attend Father's Funeral Through Video Call, Pay ₹5,100 for Last Rites Sonipat, August 6: A heartbreaking incident from Haryana's Sonipat has sparked widespread debate on social media after three daughters attended

కానీ అతని ఆవేదనను ఏ ఒక్క కూతురూ పట్టించుకోలేదు. అలా ఆ బాధతోనే ఆయన కొన్ని రోజుల క్రితమే తుదిశ్వాస విడిచాడు. ఆ విషయాన్ని ఆశ్రమం నిర్వాహకులు ముగ్గురు కూతుళ్లకూ చెప్పారు. కానీ వాళ్లు ఏ మాత్రం చలించలేదు. తండ్రి చివరి చూపుకు కూడా రావడం కరాఖండిగా చెప్పేశారు. దూరంగా ఉన్నామని, టైం లేదని ఏవేవో కారణాలు చెప్పారు. అంతేకాక, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,100 ఆన్‌లైన్‌లో పంపారు.

ఆ ప్రక్రియను వీడియో కాల్ ద్వారా లైవ్ లో చూపించాలని వారు కోరడం మానవత్వాన్ని మాయని మచ్చని తెచ్చిపెట్టింది. కనీసం ఆ తండ్రి అస్థికలను కూడా తీసుకోవడానికి వారు సుముఖత చూపలేదు. గంగలో కలిపేయండి కోరారు. తమ బంధువులు కూడా ఎవరూ లేకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక స్వచ్ఛంద సంస్థ (NGO) ప్రతినిధులే కన్న బిడ్డలై అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

మానవ సంబంధాలు పూర్తిగా డిజిటలైజ్ మయమైపోయాయి. ఆప్యాయతలను ఆన్‌లైన్ పేమెంట్లు భర్తీ చేస్తున్నాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఈ రోజుల్లో టెక్నాలజీ మరింత పెరిగింది. సో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ మనుషుల మధ్య బంధాలు, ప్రేమలు మాత్రం చాలా తగ్గిపోయాయి. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఆర్థికంగా స్థిరపడాలనే. కానీ మరీ తమ చివరి రోజుల్లో కూడా దూరంగా ఉండాలని ఎవరూ కోరుకోరు. ఆఖరి రోజుల్లో వారికి కావల్సింది కాసింత ప్రేమ, ఓదార్పు మాత్రమే గానీ.. ఆస్తిపాస్తులు, హోదాలు కాదు. కన్న పిల్లలకే ఆ మాత్రం ప్రేమ, మానవత్వం లేకపోతే సమాజం మాత్రం ఎవర్ని పట్టించుకుంటుంది. ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా మానవ జాతికే సిగ్గుచేటు.

Also Read: Periods in Temple: గుళ్లో ఉండగా పిరియడ్స్ వస్తే ఏం చేయాలి? పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి?