Viral: వేసవి కాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. చల్లదనం కోసం చాలామంది బీర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఓ ఘటన మందుబాబులను షాక్‌కు గురి చేసింది.
అక్బర్‌పేట్ భూంపల్లిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాప్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అక్కడ కింగ్‌ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని బీర్లు తాగిన తర్వాత, మరో బాటిల్‌లో ఏకంగా కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.
దీంతో ఆ బీర్ బాటిల్‌ను తీసుకుని వెంటనే వైన్ షాప్‌కు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే వారు నిర్లక్ష్యంగా స్పందించారని, దీనితో అతడు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం స్థానిక ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు వెంటనే వైన్ షాప్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ ఎలా చేరిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది తయారీ లోపమా, లేక ఎవరైనా కావాలనే ఇలా చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మద్యం నాణ్యత, వినియోగదారుల భద్రతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీర్ బాటిళ్లలో చెత్త, బల్లి, ఎలుకలు కనిపించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మద్యం ఉత్పత్తులపై కఠిన తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
