BREAKING: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏప్రిల్ 22 నుంచి కొనసాగుతోంది. బస్సులు ఎక్కువగా డిపోలకే పరిమితమవగా, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ నిరసనలో భాగంగా బస్టాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు మార్చారు. అయితే 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకండి. ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదు” అని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం తమకు ముఖ్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మికులతో సమావేశం కానుంది.

మరోవైపు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈయూ కార్యాలయంలో సమావేశమైన జేఏసీ నాయకులు వెంకన్న, థామస్‌రెడ్డి తదుపరి నిరసనల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం సానుకూల పరిణామంగా భావిస్తున్నప్పటికీ, జేఏసీ ప్రకటించిన నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రుల కమిటీతో జరగనున్న చర్చల తర్వాత సమ్మె ముగుస్తుందా లేదా మరింత తీవ్రం అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేం.
