Inter Result: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీలైతే ఏప్రిల్ 6న ఫలితాలను ప్రకటించాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉంది. ప్రధాన పరీక్షలు మార్చి 18తో ముగియగా, మార్చి 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది.
జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, మే 31లోపు ఫలితాలు ప్రకటించాలని బోర్డు నిర్ణయించింది. గత ఏడాది ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల కాగా, సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 16న వచ్చాయి.
ఈసారి మూల్యాంకనం వేగవంతం చేసేందుకు స్పాట్ కేంద్రాల పని సమయాన్ని పెంచారు. ఇంతకుముందు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉండగా, ఇప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పని చేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అయితే జవాబు పత్రాల సంఖ్య పెరగడం పై కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు 30 పేపర్లు ఇచ్చేవారని, ఇప్పుడు 45 వరకు ఇస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఏకాగ్రత తగ్గి, తప్పులు జరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పందిస్తూ, గరిష్టంగా 40 పేపర్ల వరకు మాత్రమే ఇవ్వాలని సూచించామని, దాని కంటే ఎక్కువ ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఉగాది, రంజాన్ పండుగల సందర్భంలో సెలవులు కావాలనుకునే వారు మూల్యాంకనానికి హాజరుకాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరినీ బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే మూల్యాంకన ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
ఇక ప్రతి లెక్చరర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున జవాబు పత్రాలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. మొత్తం మీద ఈసారి ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే లక్ష్యంతో ఇంటర్ బోర్డు వేగంగా చర్యలు చేపడుతోంది.
