Telangana: జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని బతికే ఉన్నప్పటికీ శ్మశానవాటికలో వదిలివెళ్లడం కలకలం రేపుతోంది.
మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన ఎండ్రికాయల శ్రీధర్ (49)కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం ఆయన సౌదీ అరేబియాకు వెళ్లి ఒక కంపెనీలో పనిచేశాడు. అయితే వేతనం తక్కువగా ఉన్నప్పటికీ చెడు అలవాట్లకు లోనై, క్రమంగా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడని సమాచారం.
ఇదిలా ఉండగా, ఇంట్లో భార్య సునీత కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తూ వచ్చింది. ఇటీవల శ్రీధర్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో, అక్కడి కంపెనీ అతడిని తిరిగి భారత్‌కు పంపించింది. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు వైద్యం చేయించగా, ఆయన మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు.
అయితే పరిస్థితి విషమించడంతో, గురువారం రాత్రి శ్రీధర్‌ను చింతకుంట శ్మశానవాటికలో వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు మధ్యాహ్నం అటుగా వెళ్లిన కొందరు అతడిని గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది శ్రీధర్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్, తనను భార్య మరియు సోదరుడు పట్టించుకోలేదని చెబుతున్నాడు. మరోవైపు, అతడిని వదిలేసి సునీత గాంధీనగర్‌లోని తన పుట్టింటికి వెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
