Crime: పాలు పొంగాయని.. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్య

Husband commits suicide out of anger at wife because milk boiled over

Husband commits suicide out of anger at wife because milk boiled over

Crime: కడప జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాలు పొంగిన విషయంపై భార్యతో జరిగిన వాగ్వాదం తర్వాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప తాలూకా పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప బాలాజీ నగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య (53), అనురాధ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటసుబ్బయ్య గతంలో గల్ఫ్ దేశాల్లో పనిచేసి, ఇటీవల కడపకు తిరిగి వచ్చి ఒక దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఆదివారం రోజు అనురాధ స్టవ్‌పై పాలు పెట్టగా అవి పొంగిపోయాయి. ఈ విషయంపై కోపగించిన వెంకటసుబ్బయ్య, ఎంత చెప్పినా వినడం లేదంటూ ఆగ్రహానికి లోనయ్యాడు. ఆవేశంలో తలను గోడకు కొట్టుకోవడంతో స్వల్ప గాయం అయ్యింది. ఈ పరిస్థితిని చూసి భయపడిన అనురాధ బయటకు వెళ్లి కూర్చుంది.

ఈ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటసుబ్బయ్య ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అనురాధ ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఉరిలో వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల వారు చేరుకుని అతన్ని కిందికి దించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తాలూకా ఎస్సై మహమ్మద్ రఫి తెలిపారు.

Also Read: Chewing Gum: బబుల్ గమ్ (చూయింగ్ గమ్) మింగితే ఏమవుతుందంటే..

Crime: పాలు పొంగాయని.. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్య