Home Loan: సొంతిల్లు కట్టుకోవడం చాలా మంది కల. ఆ కల నెరవేరాలంటే ఆశామాషీ ఏం లేదు. ఎన్నో ఏళ్లు సేవింగ్స్ పెడితే గానీ ఒక సొంతిల్లు ఉండాలన్న కల నెరవేరదు. కానీ చాలా మందికి ఆ పొదుపు చేసేంత ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. అలాగని వాళ్ల కోరిక తీర్చుకోకుండా ఉంటారు.. అందుకు వారు ఎంచుకునే మరో మార్గమే హౌస్ లోన్(Home Loan). కానీ ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త ఇల్లు కొనాలన్నా అందరికీ ముందుగా వచ్చే పెద్ద సందేహం “నా జీతానికి లేదా ఆదాయానికి బ్యాంకు ఎంతవరకు హౌస్ లోన్ ఇస్తుంది?” అని. చాలామంది బ్యాంకులు మన ఆదాయాన్ని బట్టి పూర్తి మొత్తం లోన్ ఇచ్చేస్తాయని అనుకుంటారు. కానీ బ్యాంకులు మీ లోన్ లిమిట్‌ను నిర్ణయించడానికి కొన్ని ముఖ్యమైన రూల్స్, లెక్కలను పరిగణలోకి తీసుకుంటాయి.

1. మీ ఆదాయం ఆధారంగా లోన్ అమౌంట్ (FOIR లెక్క)
బ్యాంకులు మీరు నెలకు పొందే నికర ఆదాయంలో (Net Salary) గరిష్టంగా 50% మాత్రమే EMI కట్టడానికి అనుమతిస్తాయి. దీనిని ఫైనాన్స్ భాషలో FOIR (Fixed Obligation to Income Ratio) అంటారు.
ఉదాహరణకు: మీ నెల జీతం రూ.50,000 అనుకుందాం. బ్యాంకు ప్రకారం మీ నెలసరి EMI రూ.25,000 దాటకూడదు.
-
పాత అప్పులు ఏవీ లేకపోతే: మీరు నెలకు రూ.25,000 EMI కట్టగలరు కాబట్టి, బ్యాంకు మీకు సుమారు రూ.28 లక్షల నుండి రూ.30 లక్షల వరకు హౌస్ లోన్ ఇస్తుంది.
-
ఇప్పటికే వేరే EMIలు ఉంటే: ఒకవేళ మీకు ఇప్పటికే రూ,10,000 కార్ లోన్ వంటి EMI లు ఉంటే, మీ వద్ద మిగిలేది రూ.15,000 మాత్రమే. సో అప్పుడు మీకు లభించే హౌస్ లోన్ లిమిట్ రూ.17 లక్షల నుండి రూ.18 లక్షలకు తగ్గిపోతుంది.

2. ఇంటి ఖరీదును బట్టి బ్యాంకు ఇచ్చే లోన్ (LTV Rule)
మీకు ఎంత పెద్ద మొత్తంలో లోన్ అర్హత ఉన్నప్పటికీ, కొనుగోలు చేసే ఆస్తి (Property Value) మొత్తాన్ని బ్యాంకు లోన్‌గా ఇవ్వదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం కొంత శాతం మీరే డౌన్ పేమెంట్ (Down Payment) కింద చెల్లించాలి.
| ఇంటి ఖరీదు (Property Value) | బ్యాంకు ఇచ్చే గరిష్ట లోన్ % | మీరు చెల్లించాల్సిన సొంత డబ్బు (Down Payment) |
| రూ.30 లక్షల వరకు | 90% వరకు | 10% |
| రూ.30 లక్షల నుండి రూ.75 లక్షలు | 80% వరకు | 20% |
| రూ.75 లక్షల కంటే ఎక్కువ | 75% వరకు | 25% |
ఉదాహరణకు: మీరు రూ.50 లక్షల విలువైన ఇల్లు కొంటున్నట్టయితే, బ్యాంకు గరిష్టంగా మీకు రూ.40 లక్షలు (80%) మాత్రమే లోన్ గా ఇస్తుంది. మిగిలిన రూ.10 లక్షలు మీ సొంత నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
3. లోన్ లిమిట్‌ను ప్రభావితం చేసే ఇతర 3 అంశాలు
-
సిబిల్ స్కోర్ (CIBIL Score): మీ సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, బ్యాంకులు ఎలాంటి అభ్యంతరం లేకుండా గరిష్ట లిమిట్‌తో పాటు తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇస్తాయి.
-
వయస్సు (Age & Tenure): 25 నుండి 35 ఏళ్ల వయస్సు ఉన్నవారికి 30 ఏళ్ల గడువు (Tenure) ఇస్తారు. వ్యవధి పెరిగే కొద్దీ నెలసరి EMI భారం తగ్గి, ఎక్కువ లోన్ పొందే అవకాశం పెరుగుతుంది.
-
జాయింట్ లోన్ (Co-Applicant): మీ లోన్ అర్హతను పెంచుకోవడానికి భార్య లేదా తండ్రి ఆదాయాన్ని జోడించి ‘జాయింట్ హౌస్ లోన్’ కింద అప్లై చేస్తే లిమిట్ డబుల్ అవుతుంది.
లోన్లు క్లియర్ చేసుకోవాలి:
హౌస్ లోన్ కోసం అప్లై చేసే ముందు మీ పాత క్రెడిట్ కార్డ్ బకాయిలు లేదా పర్సనల్ లోన్లను క్లియర్ చేసుకోవడం వల్ల మీ అర్హత (Eligibility) పెరుగుతుంది. అలాగే మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకుని, మీ డౌన్ పేమెంట్ బడ్జెట్‌ను సిద్ధం చేసుకున్న తర్వాతే బ్యాంకును సంప్రదించడం మంచిది. లేదంటే అంచనాలు, ఆశలు ఆవిరై నిరాశపడాల్సి వస్తుంది.
Also Read: Loss of Appetite: ఆకలేస్తుంది.. కానీ తినాలనిపించడం లేదా? కారణాలివే!
