AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10,060 ఉద్యోగాలతో ఈ క్యాలెండర్‌ను ప్రకటిస్తూ, వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ జాబ్ క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.
ఈ క్యాలెండర్‌లో ముఖ్యంగా పాఠశాల విద్య మరియు ఇంటర్ విద్యా శాఖల్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ విభాగాల్లో మొత్తం 3004 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అలాగే హోమ్ శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతూ, సుమారు 2778 పోస్టులు ప్రకటించారు. ఉన్నత విద్యా శాఖలో 1500 పోస్టులు ఉండగా, గ్రూప్-1 కింద 91 పోస్టులు, గ్రూప్-2 కింద 750 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులు ఉన్నాయి. ఇతర శాఖల్లో 928 పోస్టులతో పాటు అదనంగా 506 పోస్టులు కూడా ఈ క్యాలెండర్‌లో చేర్చారు.
విభాగాల వారీగా చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్‌లో 3004 పోస్టులు, హోమ్ శాఖలో మొత్తం 3057 పోస్టులు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 1500 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 452 పోస్టులు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి విభాగంలో 328 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటర్ రిసోర్సెస్ శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో 169 పోస్టులు, అడవులు మరియు పర్యావరణ శాఖలో 140 పోస్టులు ప్రకటించారు.
ఇక నోటిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం వెల్లడించింది. స్కూల్ ఎడ్యుకేషన్ (3004 పోస్టులు)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను మే 15న విడుదల చేయనున్నారు. గ్రూప్-1 (91 పోస్టులు), హోమ్ శాఖ (2778 పోస్టులు), ఇతర శాఖల (928 పోస్టులు) నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. అలాగే గ్రూప్-2 (750 పోస్టులు), ఇంజనీరింగ్ (503 పోస్టులు), ఇతర పోస్టులు (506)కు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యువతలో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతోంది.
