Mobile Photography: ఈ రోజుల్లో అద్భుతమైన ఫొటోలు తీయడానికి డిఎస్‌ఎల్‌ఆర్ (DSLR) లేదా ఖరీదైన ప్రొఫెషనల్ కెమెరాలు ఉండాల్సిన అవసరం లేదు. మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ కెమెరా(Mobile Photography)తోనే డిఎస్‌ఎల్‌ఆర్ స్థాయి క్లారిటీ ఉన్న ఫొటోలను సులభంగా క్లిక్ చేయవచ్చు. కానీ చాలామంది ఫోన్ కెమెరా నాణ్యత బాగా లేదని అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే, సరైన టెక్నిక్స్, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌తోనే అద్భుతమైన, క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఆ మెళకువలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
1. కెమెరా లెన్స్ శుభ్రం చేయడం
మనం ఫోన్‌ను రోజూ చేతితో పట్టుకోవడం వల్ల కెమెరా లెన్స్‌పై వేలిముద్రలు, దుమ్ము, నూనె జిడ్డు చేరుతాయి. దీనివల్ల ఫొటోలు మసకగా (Blur) వస్తాయి. కాబట్టి ఫొటో తీసే ముందు సున్నితమైన మైక్రోఫైబర్ గుడ్డతో కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి.
2. లైటింగ్ సరిగ్గా ఉండాలి
మంచి ఫొటోకి కాంతి (Lighting) అత్యంత ముఖ్యం. వీలైనంత వరకు సహజమైన సూర్యకాంతి (Natural Light) ఉన్న చోట ఫొటోలు తీయడానికి ప్రయత్నించండి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో వచ్చే వెలుతురు (Golden Hour) లో ఫొటోలు అత్యంత ఆకర్షణీయంగా వస్తాయి. లైట్ ఎప్పుడూ మీరు తీసే వస్తువు లేదా వ్యక్తిపై పడాలి కానీ, కెమెరాకు ఎదురుగా ఉండకూడదు.
3. డిజిటల్ జూమ్ వాడకండి
ఫోన్‌లో జూమ్ చేసి ఫొటో తీస్తే పిక్సెల్స్ పగిలిపోయి ఫొటో క్వాలిటీ తీవ్రంగా దెబ్బతింటుంది. జూమ్ చేయడానికి బదులుగా మీరే ఆ వస్తువు దగ్గరకు వెళ్ళి ఫొటో తీయడం మంచిది.
4. ఫోకస్ మరియు ఎక్స్‌పోజర్
స్క్రీన్ పై మీరు ఏ భాగం స్పష్టంగా కనిపించాలో అక్కడ ట్యాప్ (Tap) చేసి ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడు పక్కన వచ్చే సన్ (Sun) ఐకాన్‌ను పైకి, కిందకి జరపడం ద్వారా వెలుతురును (Exposure) పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

5. గ్రిడ్‌లైన్స్ (Gridlines) ఉపయోగించండి
కెమెరా సెట్టింగ్స్‌లో Gridlines ఆన్ చేయడం వల్ల స్క్రీన్‌పై గ్రిడ్ వస్తుంది. దీనివల్ల ‘రూల్ ఆఫ్ థర్డ్స్’ (Rule of Thirds) సూత్రాన్ని పాటిస్తూ సబ్జెక్ట్‌ను సరైన కోణంలో ఉంచి ప్రొఫెషనల్ ఫొటోలు తీయవచ్చు.
6. ఎడిటింగ్ యాప్స్
ఫొటో తీసిన తర్వాత ఫోటోషాప్, స్నాప్‌సీడ్ (Snapseed) లేదా లైట్‌రూమ్ (Lightroom) వంటి ఉచిత యాప్‌లలో రంగులు, బ్రైట్‌నెస్ స్వల్పంగా సరిచేస్తే మీ ఫొటో ప్రొఫెషనల్ లుక్ పొందుతుంది.
Also Read: Youtube Channel: కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకుంటారా.. ఫస్ట్ ఇవి తెలుసుకోండి
