Indian Railway: రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

Railways lets you swap names on reserved tickets

Railways lets you swap names on reserved tickets

Indian Railway: కొన్నిసార్లు మన పేరుతో రైల్వే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, అనుకోని కారణాల వల్ల ప్రయాణించలేకపోవచ్చు. అప్పుడు ఆ టికెట్‌ను ఇంట్లోని మరొకరికి మార్చుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. భారతీయ రైల్వే నియమాల ప్రకారం కొన్ని పరిస్థితుల్లో టికెట్‌పై పేరు మార్పు (ట్రాన్స్‌ఫర్) చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

మీ దగ్గర కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ ఉండి మీరు ప్రయాణించలేకపోతే, రైలు బయలుదేరే సమయానికి కనీసం 24 గంటల ముందు సంబంధిత రిజర్వేషన్ కార్యాలయంలోని చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తుతో పాటు ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రింట్ కాపీ, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్ సమర్పించాలి. అనుమతి లభిస్తే టికెట్‌ను మరొకరికి బదిలీ చేయవచ్చు.

కుటుంబ సభ్యులకు బదిలీ:
ఒక వ్యక్తి తన టికెట్‌ను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్య వంటి కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకోవచ్చు. దీనికి 24 గంటల ముందు రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలి. ప్రధాన స్టేషన్లలో స్టేషన్ మేనేజర్‌కు కూడా అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులు:
అధికారిక విధుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 24 గంటల ముందు లిఖితపూర్వకంగా అభ్యర్థిస్తే పేరు మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.

విద్యార్థుల గ్రూపులు:
విద్యార్థులు గ్రూప్‌గా ప్రయాణిస్తుంటే, వారి విద్యాసంస్థ అధిపతి రైలు బయలుదేరే 48 గంటల ముందు దరఖాస్తు చేస్తే, ఒక విద్యార్థి పేరును అదే సంస్థలోని మరొక విద్యార్థి పేరుతో మార్చవచ్చు.

పెళ్లి వేడుకల కోసం గ్రూపులు:
పెళ్లికి సంబంధించిన ప్రయాణాల్లో, గ్రూపులోని ఒక సభ్యుడి పేరు మరొకరికి బదిలీ చేయడానికి 48 గంటల ముందు అభ్యర్థన ఇవ్వాలి.

NCC క్యాడెట్లు:
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) గ్రూపులకు కూడా 24 గంటల ముందు అభ్యర్థిస్తే పేరు మార్పు సౌకర్యం ఉంటుంది.

అయితే ఒక టికెట్‌పై పేరు మార్పు ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. గ్రూప్ టికెట్ల విషయంలో మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం మించకుండా మాత్రమే పేరు మార్పులు చేస్తారు. అలాగే రాయితీ (కన్సెషన్)పై జారీ చేసిన టికెట్లకు పేరు మార్పు సౌకర్యం ఉండదు.

కాబట్టి టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ నియమాలను తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Also Read: Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫొటోలకు 12 గంటల్లో 2.6కోట్ల లైక్స్!

Indian Railway: రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!