Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు భారతీయ రైల్వే మరో పెద్ద అవకాశాన్ని ప్రకటించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా లెవెల్-1 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి మొత్తం 22,195 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ అప్రెంటిస్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు తప్పనిసరిగా ఒక్క ఆర్‌ఆర్‌బీకే అప్లై చేయాలి. అయితే పరీక్షలు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తారు. ఎంపికైన వారికి అసిస్టెంట్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో చేరిన వెంటనే సుమారు రూ.35 వేల వరకు జీతం లభించే అవకాశం ఉంది. కొత్త పే కమిషన్ అమలైతే ఇది రూ.50 వేలకుపైగా పెరగవచ్చు. సేవా కాలం, విద్యార్హతలు, అంతర్గత పరీక్షల ఆధారంగా భవిష్యత్తులో పదోన్నతులు పొందే అవకాశమూ ఉంటుంది.
పరీక్ష విధానం
ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
-
మొత్తం మార్కులు: 100
-
ప్రశ్నలు: 100 (ప్రతి ప్రశ్నకు 1 మార్కు)
-
తప్పు సమాధానానికి మూడో వంతు నెగటివ్ మార్కింగ్
-
పరీక్ష సమయం: 90 నిమిషాలు
విభాగాల వారీగా ప్రశ్నలు ఇలా ఉంటాయి:
-
జనరల్ సైన్స్ – 25
-
మ్యాథమెటిక్స్ – 25
-
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 30
-
జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ – 20
కనీస అర్హత మార్కులు:
-
యూఆర్, ఈడబ్ల్యూఎస్ – 40%
-
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ – 30%
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
సీబీటీ ఫలితాల ఆధారంగా ఖాళీలకు మూడు రెట్లు మంది అభ్యర్థులను పీఈటీకి పిలుస్తారు.
పురుషులు:
-
35 కిలోల బస్తాను 2 నిమిషాల్లో 100 మీటర్లు మోసుకెళ్లాలి
-
తర్వాత 1 కిమీని 4 నిమిషాలు 15 సెకన్లలో పూర్తి చేయాలి
మహిళలు:
-
20 కిలోల బరువును 100 మీటర్లు మోసాలి
-
1 కిమీని 5 నిమిషాలు 40 సెకన్లలో పూర్తి చేయాలి
ఈ రెండు పరీక్షలను ఒకేసారి పూర్తి చేయాలి. ఆ తరువాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో తుది ఎంపిక జరుగుతుంది.
పోటీ పరిస్థితి
గతంలో డిసెంబర్ 2024లో విడుదలైన నోటిఫికేషన్‌కు 32,438 పోస్టులకు 1.08 కోట్ల మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 500 మందికి పైగా పోటీ పడింది. ముఖ్యంగా సికింద్రాబాద్, ముంబయి జోన్లలో భారీ పోటీ కనిపించింది. అందువల్ల ఈసారి కూడా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రైల్వే నియామకాలలో ప్రత్యేకత ఏమిటంటే, పరీక్షకు హాజరైతే దరఖాస్తు ఫీజులో కొంత మొత్తాన్ని తిరిగి ఇస్తారు.
సన్నద్ధత ఎలా ఉండాలి?
ముందుగా పూర్తి సిలబస్ తెలుసుకోవాలి. 8వ నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలే బేసిక్ కావడంతో వాటితో చదువు ప్రారంభిస్తే బలమైన పునాది ఏర్పడుతుంది. ముఖ్యాంశాలపై నోట్స్ తయారు చేసుకుని, ప్రతి టాపిక్‌పై ఎక్కువగా ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే పరీక్ష విధానం సులభంగా అర్థమవుతుంది.
మాక్ టెస్టులు ఎక్కువగా రాయడం చాలా అవసరం. ఫలితాలను విశ్లేషించి బలహీనమైన అంశాలపై దృష్టి పెట్టాలి. ఒక్కో ప్రశ్నకు సగటున 54 సెకన్లు మాత్రమే సమయం ఉండటంతో సులువైన ప్రశ్నలను ముందుగా చేయాలి. తెలియని ప్రశ్నలను వదిలేస్తే నెగటివ్ మార్కులు తగ్గుతాయి. మ్యాథ్స్, సైన్స్ కోసం పాలిటెక్నిక్, RRB, SSC MTS పాత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి. కరెంట్ అఫైర్స్ కోసం రోజూ పత్రికలు చదవడం మంచిది.

ముఖ్య వివరాలు
-
పోస్టు: లెవెల్-1
-
ఖాళీలు: 22,195
-
అర్హత: పదో తరగతి / ఐటీఐ / ఎన్‌సీవీటీ అప్రెంటిస్
-
వయసు: 18–33 సంవత్సరాలు (రిజర్వేషన్ సడలింపులు వర్తిస్తాయి)
-
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 2
-
ఫీజు: రూ.250 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ/ఇతర వర్గాలు), రూ.500 (ఇతరులు)
-
వెబ్‌సైట్: rrbapply.gov.in
మొత్తానికి, ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సరైన ప్రణాళికతో ఇప్పటి నుంచే సిద్ధమైతే రైల్వే ఉద్యోగం సాధించే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది.
Also Read: Laptop: సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ కొనాలనుకొంటున్నారా?
Jobs: టెన్త్ అర్హతతో.. రూ.50వేలకుపైగా జీతం!
