Virosh Wedding: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘గీతాగోవిందం’తో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు పెళ్లితో కొత్త దశలోకి అడుగుపెట్టింది. వెండితెరపై వీరి కెమిస్ట్రీ ఎంత మ్యాజిక్ సృష్టించిందో, నిజ జీవితంలో జరిగిన ఈ వివాహ వేడుక కూడా అంతే గ్రాండ్‌గా సాగింది.
ఈ వేడుకలో ముఖ్యంగా వధూవరులు ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే హంగు ఆర్భాటాలకు కొదవ ఉండదు. విరోష్ (ViRash) వివాహంలో కూడా అదే స్థాయి విలాసం కనిపించింది. ముఖ్యంగా రష్మిక ధరించిన నగల గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.
ముహూర్త సమయానికి రష్మిక సంప్రదాయ వధువుగా మెరిసిపోయింది. ఆమె మెడలో ఒక భారీ హారం, దానికి తోడు పొడవాటి లాంగ్ చైన్, నడుముకు వడ్డాణం, మంగళసూత్రం, చేతులకు నిండుగా బంగారు గాజులు, పెద్ద చెవిపోగులు ఇలా ఒంటినిండా ఆభరణాలు ధరించింది. నిపుణుల అంచనా ప్రకారం ఆమె ధరించిన బంగారం బరువు సుమారు 1.5 నుంచి 2 కిలోల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. వీటిలో కత్తిరించని వజ్రాలు, పచ్చలు, కెంపులు వంటి విలువైన రాళ్లు పొదిగినట్లు తెలుస్తోంది. డిజైనర్ బ్రాండ్ విలువ, మేకింగ్ ఛార్జీలు కలిపి రష్మిక పెళ్లి నగల మొత్తం విలువ కనీసం రూ.5 కోట్ల వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ కూడా తన వివాహ వేడుకలో రాయల్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. సాధారణంగా వరులు తక్కువ నగలు ధరిస్తారు. కానీ విజయ్ మాత్రం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను ఎంచుకున్నాడట. మెడలో ముత్యాలు, వజ్రాలతో కూడిన హారం, చేతులకు స్టైలిష్ బ్రేస్‌లెట్లు, వేళ్లకు ఖరీదైన వజ్రాల ఉంగరాలు ధరించాడు. విజయ్ ధరించిన నగల బరువు దాదాపు అర కిలోకిపైగా ఉండవచ్చని, వాటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఒక కిలో బంగారం ధర సుమారు రూ.75–80 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే సెలబ్రిటీలు ధరించే నగలు సాధారణ బంగారం లెక్కలతో పోల్చలేము. ప్రత్యేక డిజైన్లు, విలువైన రాళ్లు, బ్రాండ్ విలువ వంటి అంశాలు కలిసినప్పుడు వాటి ధరలు గణనీయంగా పెరుగుతాయి.
మొత్తానికి విజయ్-రష్మికల వివాహం కేవలం ఓ పెళ్లి వేడుక మాత్రమే కాదు, ఒక కనులవిందుగా నిలిచింది. ఆభరణాల విషయంలో ఈ జంట సెట్ చేసిన ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విలువలకు సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం వీటి విలువ కోట్లు దాటిందని చెబుతున్నారు.
