Plots on Moon: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమై వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకోవడంతో చంద్రుడిపై మళ్లీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన డెన్నిస్ హోప్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
1980లలోనే డెన్నిస్ హోప్ చంద్రుడిని తన సొంత ఆస్తిగా ప్రకటించి, అక్కడ ప్లాట్లు అమ్మడం ప్రారంభించారు. అప్పట్లో ఇది విచిత్రంగా అనిపించినా, ఇప్పటివరకు ఆయన సుమారు 70 లక్షల మందికి చంద్రుడిపై స్థలాలు విక్రయించినట్లు చెబుతున్నారు. ఈ వ్యాపారం ద్వారా రూ. 100 కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం.
ఈ వ్యవహారానికి ఆయన ఉపయోగించుకున్నది 1967లో రూపొందిన ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం కూడా చంద్రుడు వంటి గ్రహాలపై యాజమాన్య హక్కులు కలిగి ఉండకూడదు. అయితే వ్యక్తుల గురించి స్పష్టంగా ప్రస్తావన లేకపోవడాన్ని గమనించిన డెన్నిస్ హోప్, ఈ లోపాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఐక్యరాజ్యసమితికి లేఖ రాసి చంద్రుడిపై తన హక్కు ఉందని ప్రకటించారు. అనంతరం ‘లూనార్ ఎంబసీ’ అనే సంస్థను స్థాపించి, తక్కువ ధరలకు ప్లాట్లు అమ్మడం ప్రారంభించారు.
చంద్రుడిపై స్థలాలు కొనుగోలు చేసిన వారిలో సాధారణ ప్రజలతో పాటు హాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఉన్నారని ప్రచారం ఉంది. అయితే ఈ ప్లాట్లకు ఎలాంటి చట్టబద్ధత లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు, న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం చంద్రుడు మొత్తం మానవాళికి చెందుతుంది, ఒక వ్యక్తి దాన్ని స్వంతంగా ప్రకటించడం లేదా అమ్మడం చట్టపరంగా సరైనది కాదు.
అయినా కూడా భవిష్యత్తులో చంద్రుడిపై నివాసం ఉండే అవకాశాలపై ఉన్న ఆశతోనో, లేదా ప్రత్యేక గిఫ్ట్‌గా ఇవ్వాలనే ఉద్దేశంతోనో చాలా మంది ఈ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఆకాశంలో ఉన్న చంద్రుడిపై భూమి మీద వ్యాపారం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
