Breaking కల్వకుంట్ల కవిత అరెస్టు

Kavitha: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికార యంత్రాంగం తొలగించడం వివాదానికి దారితీసింది. ఈ చర్యకు నిరసనగా బాధితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ బాధితులతో కలిసి ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు.

అంబేద్కర్ విగ్రహం ఎదుట సుమారు రెండు గంటల పాటు వారు బైఠాయించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అంబేద్కర్ సెంటర్ పరిసరాలు హోరెత్తాయి.

ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో మహిళా బాధితులు మరియు లేడీ పోలీసుల మధ్య కూడా స్వల్ప ఘర్షణ జరిగింది. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బాధితులు అక్కడే కూర్చున్నారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించారు. అయితే కవితను అరెస్ట్ చేసే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంపై జాగృతి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలిని పురుష పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని వారు ప్రశ్నించారు.

పోలీసుల చర్యలకు నిరసనగా కవిత అనుచరులు పోలీస్ వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల భూదాన భూముల్లో ఏళ్లుగా నివసిస్తున్న పేదల గుడిసెలను ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం అన్యాయం అని విమర్శించారు. బాధితులకు ఇళ్లు కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఈ ఘటన తర్వాత ఖమ్మం నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. అరెస్ట్ చేసిన నాయకులు, నిరసనకారులను సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Also Read: Mobile: పొరపాటున కూడా మొబైల్‌లో ఈ పనులు చేయకండి

Breaking కల్వకుంట్ల కవిత అరెస్టు