Weather Report: దేశంలో ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మార్చి నుంచి మే నెలల వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ భారతంతో పాటు మధ్య భారత ప్రాంతాల్లో హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు.
తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం సూచించింది. హీట్ వేవ్స్ కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బయట పనులు చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిదని చెబుతున్నారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మొత్తంగా ఈసారి వేసవి తీవ్రంగా ఉండే సూచనలు ఉన్నందున ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే హీట్ వేవ్స్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
