Tragedy: ఉమ్మడి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం అగ్నిగుండం కార్యక్రమం నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో సుమారు పది మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారు జామున సుమారు 4 గంటల సమయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం దాటే ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అగ్నిగుండం దాటుతున్న వారిని వెనుక నుంచి ఉన్నవారు తొందరగా ముందుకు నెట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఒకరినొకరు తోసుకోవడంతో అగ్నిగుండం దాటుతున్న కొందరు భక్తులు సంతులనం కోల్పోయి నేరుగా నిప్పుల కుప్పలో పడిపోయారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారిని షాక్కు గురి చేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే విధుల్లో ఉన్న పోలీసులు, స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి నిప్పుల్లో పడిన భక్తులను బయటకు లాగారు. వారి అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.
ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
