Iran: ముస్లిం దేశాలపైనే ఇరాన్ దాడి ఎందుకు?

Multiple Arab states that host US assets targeted in Iran retaliation

Multiple Arab states that host US assets targeted in Iran retaliation

Iran: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను రెండు వర్గాలుగా విడగొట్టింది. ఒకవైపు అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్ తన మిత్రపక్షాల సహకారంతో ప్రతిదాడులు చేపడుతోంది. అయితే ఇరాన్ కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం కాకుండా, అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలనూ లక్ష్యంగా చేసుకుంటోంది. శనివారం దుబాయ్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాలపై మిసైల్ దాడులు జరిపినట్లు సమాచారం.

ఇరాన్ లక్ష్యం ప్రధానంగా ఇజ్రాయెల్ అయినప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతర్ వంటి దేశాలు తాము తటస్థంగా ఉన్నామని ప్రకటించినా, ఇరాన్ వాటిని అనుమానంతో చూస్తోంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

1. అమెరికా సైనిక స్థావరాలు:

గల్ఫ్ దేశాలు రాజకీయంగా తటస్థంగా ఉన్నామని చెబుతున్నా, ఆ దేశాల్లో అమెరికాకు చెందిన ముఖ్యమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. ఖతర్‌లో ‘అల్ ఉదైడ్’ ఎయిర్ బేస్, యూఏఈలో ‘అల్ దఫ్రా’ బేస్, అలాగే సౌదీ అరేబియాలో కూడా అమెరికా దళాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇరాన్ అభిప్రాయం ప్రకారం, తనపై జరుగుతున్న దాడులకు ఈ స్థావరాలే మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల అమెరికాకు స్థావరాలు కల్పిస్తున్న దేశాలు తటస్థం కావని ఇరాన్ భావిస్తోంది.

2. గగనతల వినియోగం:

ఇజ్రాయెల్ లేదా అమెరికా యుద్ధవిమానాలు ఇరాన్‌పై దాడి చేయాలంటే సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి దేశాల గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ దేశాలు తమ గగనతలాన్ని అనుమతిస్తే, అది తమపై దాడికి సహకరించినట్టే అని ఇరాన్ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేసిన దేశాలను కూడా ఇరాన్ తన శత్రువులుగా పరిగణిస్తోంది.

3. ప్రాక్సీ యుద్ధాలు,  ప్రాంతీయ ఆధిపత్య పోరు:

గత దశాబ్దంగా ఇరాన్ (షియా దేశం) ,  సౌదీ అరేబియా (సున్నీ దేశం) మధ్య ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ కొనసాగుతోంది. యెమెన్‌లోని హుతీ రెబల్స్‌కు ఇరాన్ మద్దతు ఇస్తుండగా, సౌదీ అరేబియా వారికి వ్యతిరేకంగా ఉంది. తాజా యుద్ధ నేపథ్యంలో హుతీల ద్వారా సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు జరిగుతున్నాయి. దీని ద్వారా అమెరికా మిత్రదేశాలపై ఒత్తిడి పెంచాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చమురు వ్యూహం:

ప్రపంచ చమురు సరఫరాలో గల్ఫ్ దేశాల పాత్ర కీలకం. ఇరాన్‌పై దాడులు కొనసాగితే, గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. చమురు ధరలు పెరిగితే అమెరికా మరియు దాని మిత్రదేశాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్ అంచనా వేస్తోంది. “మా చమురు బయటకు వెళ్లకపోతే, ఈ ప్రాంతంలో ఎవరి చమురు బయటకు వెళ్లనివ్వం” అనే విధంగా ఇరాన్ వ్యూహం కొనసాగుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి.

మొత్తానికి గల్ఫ్ దేశాలు తాము తటస్థమని ప్రకటించినప్పటికీ, అమెరికాతో ఉన్న రక్షణ ఒప్పందాల కారణంగా ఇరాన్ వాటిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా అమెరికాపై పరోక్ష ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నమే జరుగుతోందని భావిస్తున్నారు. శనివారం జరిగిన దాడుల తర్వాత గల్ఫ్ దేశాలు బహిరంగంగా తమ వైఖరిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Tragedy: జ్యోతిష్కుడు అలా చెప్పాడని.. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

Iran: ముస్లిం దేశాలపైనే ఇరాన్ దాడి ఎందుకు?