TTD Bans Cauliflower: తిరుమలలో కాలీఫ్లవర్‌పై టీటీడీ నిషేధం.. అసలు కారణం ఇదే!

TTD Bans Cauliflower in Tirumala Over Food Safety Concerns

TTD Bans Cauliflower: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వస్తుంటారు. భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో కాలీఫ్లవర్‌ (Cauliflower)((గోబీ) వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో కాలీఫ్లవర్‌తో తయారు చేసే వంటకాలను విక్రయించకుండా ఆదేశాలు జారీ చేసింది.

పురుగులు రావడంతో..

తిరుమలలోని ఆహార కేంద్రాలకు సరఫరా అవుతున్న కాలీఫ్లవర్‌ను పరిశీలించిన అధికారులు కొన్ని కీలక విషయాలను గుర్తించినట్లు సమాచారం. కాలీఫ్లవర్‌లో పురుగులు కనిపించడంతో పాటు, నిల్వ ఉంచినప్పుడు త్వరగా పాడయ్యే అవకాశం ఉందని గుర్తించారు. దీంతో భక్తులు తినే ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.

heavy crowd at tirumala

భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాలీఫ్లవర్‌ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమలలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కాలీఫ్లవర్‌ వంటకాలను విక్రయిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే చైనీస్ వంటకాలపై నిషేధం

తిరుమల కొండపై ఆహార నాణ్యత, పరిశుభ్రత, ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగానే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లలో చైనీస్‌ వంటకాలను ఇప్పటికే నిషేధించింది. ఇప్పుడు కాలీఫ్లవర్‌ వినియోగాన్ని కూడా నిలిపివేయడంతో ఆహార భద్రత విషయంలో టీటీడీ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

భక్తుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం

తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చూడటం టీటీడీ బాధ్యతల్లో ఒకటి. ఆహార పదార్థాల్లో పురుగులు కనిపించడం లేదా అవి త్వరగా పాడవడం వంటి సమస్యల వల్ల భక్తుల ఆరోగ్యానికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం. అందుకే కాలీఫ్లవర్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ నిషేధం తాత్కాలికంగానే అమల్లో ఉంటుందని టీటీడీ వెల్లడించింది. పరిస్థితులను పరిశీలించిన అనంతరం కాలీఫ్లవర్‌ వినియోగంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు తిరుమలలోని వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు టీటీడీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.

Also Read: Amazon Fine: అమెజాన్‌ లో అయోధ్య ప్రసాద్ పేరుతో సేల్స్.. రూ.1లక్ష ఫైన్