Hill Deaths: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో దారుణ ఘటన జరిగింది. కొత్త ఐఫోన్ కావాలని 19 ఏళ్ల కునాల్ తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మనస్తాపంతో 400-500 అడుగుల ఎత్తైన కొండపైకి వెళ్లాడు. కొడుకుకు ఏం జరుగుతుందోనని భయపడిన తల్లిదండ్రులు కూడా అతని వెంట కొండపైకి వెళ్లారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కునాల్‌ను కిందకు వచ్చి ఇంటికి వెళ్లాలని చాలా సేపు నచ్చజెప్పారు. అతడు కొండపై నుంచి దూకకుండా కింద భద్రతా వల ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నించారు. అయినా కునాల్ తన నిర్ణయం మార్చుకోలేదు.
Also Read: Dream Job: మేఘాలను వీడియో తీయడమే జాబ్.. జీతం రూ.8.5లక్షలు!
మధ్యాహ్నం సమయంలో కునాల్ కొండపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అతడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ వెంటనే ముందుకు వెళ్లి కొడుకును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కొండపై నుంచి కిందపడిపోయారు. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
భర్త, కొడుకు కళ్లముందే కిందపడటాన్ని చూసిన తల్లి సంగీత తీవ్ర విషాదానికి గురైంది. కొద్దిసేపటికే ఆమె కూడా కొండపై నుంచి దూకి ప్రాణాలు విడిచింది.
మృతులను మురళీధర్ చాంద్గుడే (48), ఆయన భార్య సంగీత, కుమారుడు కునాల్ (19)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక కొత్త ఫోన్ కొనాలన్న విషయంలో మొదలైన గొడవ చివరకు ఆ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: TTD Bans Cauliflower: తిరుమలలో కాలీఫ్లవర్‌పై టీటీడీ నిషేధం.. అసలు కారణం ఇదే!
