Aadhaar App: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్‌ను ముందుగానే (ప్రీలోడ్) ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ‘సంచార్ సాథీ’ యాప్ విషయంలో వచ్చిన విమర్శల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పటికీ, ఇప్పుడు ఆధార్ యాప్‌పై ఇదే విధమైన ప్రతిపాదనను తీసుకువచ్చింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశ్శబ్దంగా ముందుకు తెచ్చింది. ఆధార్ నిర్వహణ బాధ్యతలు చూసే యూఐడీఏఐ (UIDAI), ఈ అంశంపై ఆపిల్, శాంసంగ్ వంటి కంపెనీలతో చర్చలు జరపాలని ఐటీ మంత్రిత్వ శాఖకు సూచించింది. భారతదేశంలో అమ్మే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. అంటే మొబైల్‌లో ఉండే డిఫాల్ట్ యాప్‌ల మాదిరిగానే ఇది కూడా ముందుగానే ఉండాలనే ఉద్దేశం.
ప్రభుత్వం ప్రకారం, యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటే వినియోగదారులు వేరుగా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఆధార్ యాప్ ద్వారా వ్యక్తిగత వివరాలు అప్‌డేట్ చేయడం, బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. బ్యాంకింగ్, టెలికాం, ఎయిర్‌పోర్ట్ సేవలు వంటి అనేక రంగాల్లో ఆధార్ వినియోగం విస్తృతంగా ఉన్నందున ఈ నిర్ణయం ఉపయోగకరమని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే గూగుల్, ఆపిల్, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా స్పందించాయి. వినియోగదారుల గోప్యత, భద్రత అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి. అలాగే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఫోన్లను తయారు చేయాల్సి రావడం కూడా తమకు ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నాయి.
గతంలో ‘సంచార్ సాథీ’ యాప్ విషయంలో కూడా ఇలాంటి గోప్యత, భద్రతా సమస్యలు లేవనెత్తబడిన నేపథ్యంలో, ఇప్పుడు ఆధార్ యాప్ ప్రీలోడ్ ప్రతిపాదనపై కూడా పెద్ద చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ అంశం భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.
Also Read: Happy Raj: 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే..
Aadhaar App: కొత్త ఫోన్లలో ఆధార్ యాప్?
