Mobile Recharge Plan: భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి సంస్థలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కేటగిరీల్లో అనేక రకాల ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా కనిపించే విషయం ఏమిటంటే… చాలా ప్లాన్ల వాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉండటం. నెలలో 30 లేదా 31 రోజులు ఉన్నప్పటికీ ఎందుకు 28 రోజుల ప్లాన్ ఇస్తారో చాలా మందికి సందేహం ఉంటుంది.
సాధారణంగా నెలను మనం 30 లేదా 31 రోజులు అని భావిస్తాం. కానీ టెలికాం కంపెనీలు మాత్రం 28 రోజుల వాలిడిటీతోనే ఎక్కువ ప్లాన్లను అందిస్తాయి. దీని వెనుక ప్రధానంగా వ్యాపార ప్రయోజనం ఉందని నిపుణులు చెబుతున్నారు.
28 రోజుల ప్లాన్‌ను తీసుకుంటే వినియోగదారులు ఒక సంవత్సరంలో 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 28 రోజుల ప్లాన్ ముగిసే సరికి నెలలో ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంటాయి. ఉదాహరణకు, 30 రోజుల నెలలో రెండు రోజులు, 31 రోజుల నెలలో మూడు రోజులు మిగిలిపోతాయి. ఇలా ప్రతి నెలలో కొద్దికొద్దిగా రోజులు తగ్గిపోవడంతో చివరికి వినియోగదారులు అదనంగా మరోసారి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీంతో టెలికాం కంపెనీలకు అదనపు ఆదాయం వస్తుంది.
ఫిబ్రవరి నెలలో మాత్రమే 28 లేదా 29 రోజులు ఉంటాయి. మిగతా నెలల్లో మాత్రం ఈ లెక్క కారణంగా కస్టమర్లు ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా కంపెనీలు సంవత్సరానికి ఒక అదనపు రీఛార్జ్ లాభాన్ని పొందుతున్నాయని చెబుతున్నారు.
అయితే ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మాత్రం ఇప్పటికీ కొన్ని ప్లాన్లను 30 రోజుల వాలిడిటీతో అందిస్తోంది.
ఇక టెలికాం నియంత్రణ సంస్థ TRAI కూడా గతంలో కంపెనీలు 28 రోజుల బదులుగా 30 రోజుల వాలిడిటీ ప్లాన్లు ఇవ్వాలని సూచించింది. అయినప్పటికీ ఎక్కువ టెలికాం కంపెనీలు ఇప్పటికీ 28, 56 లేదా 84 రోజుల వాలిడిటీ ప్లాన్లనే కొనసాగిస్తున్నాయి. దీంతో వినియోగదారులు కూడా అదే విధంగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది.
Also Read: Health Tips: శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపులున్నాయా.. ఐతే కిడ్నీలు పాడైనట్టే..!
Mobile Recharge Plan: మొబైల్ రీ ఛార్జ్ ప్లాన్ 28 రోజులే ఎందుకంటే..!!
