Chicken: వీకెండ్ లోనూ పస్తులేనా.. తగ్గేదెలే అంటున్న చికెన్ ధరలు..!

Chicken rates surge as demand resumes in Telangana

Chicken rates surge as demand resumes in Telangana

Chicken: తెలంగాణలో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325 వరకు చేరింది. ఇక నాటు కోడి ధర కిలోకు రూ.750 నుంచి రూ.800 వరకు ఉంది. గత నాలుగు రోజులుగా చికెన్ రేట్లు వరుసగా పెరుగుతుండటం గమనార్హం. వ్యాపారుల ప్రకారం, కోళ్ల సరఫరా తగ్గడం, ఎండలు తీవ్రంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడిని తట్టుకోలేక కోళ్లు చనిపోతుండటంతో మార్కెట్‌లో కొరత ఏర్పడిందని చెబుతున్నారు. చికెన్ ధర రూ.325కు చేరడం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణంగా రోజుకు సుమారు 10 వేల టన్నుల చికెన్ అమ్ముడవుతుందని అంచనా. అయితే దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్ వంటి పండుగల సమయంలో ఇది 15 నుంచి 16 వేల టన్నుల వరకు పెరుగుతుంది. నగరంలోని హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాదారులు సాధారణంగా వారం లేదా పది రోజులకు సరిపడా కోళ్లను ముందుగానే కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. అయితే ఈ మధ్య ఎండలు ఎక్కువగా ఉండటంతో వారి వద్ద ఉన్న కోళ్లలో కొన్నింటి మృతి కూడా జరుగుతోందని సమాచారం.

మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయిన శంషాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యాపారులు పెద్దఎత్తున కోళ్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో సరఫరా తగ్గి, చికెన్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. కొందరు వ్యాపారులు తమ వద్ద ఉన్న కోళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

చికెన్ ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. గత నాలుగు రోజులుగా నగరంలో చికెన్ అమ్మకాలు 30 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో చాలామంది వినియోగదారులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇదిలా ఉండగా మెదక్ జిల్లాలో కోళ్ల మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కౌడిపల్లి మండలం బురుగడ్డ గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫామ్‌లో వైరస్ కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. రైతు లింగోలు ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఫామ్‌లో సుమారు 7 వేల కోళ్లు ఉన్నాయి. 24 రోజుల క్రితం ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి కోడి పిల్లలను తెచ్చి పెంచుతున్నాడు. అయితే గత వారం రోజులుగా కోళ్లు వరుసగా చనిపోతున్నాయని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు సుమారు వెయ్యి కోళ్లు మృతి చెందగా, శనివారం ఒక్కరోజే 5 వేలకుపైగా కోళ్లు చనిపోయాయి. మృతి చెందిన కోళ్లను గుంతలు తవ్వి పూడ్చిపెట్టారు. మండలంలోని మరికొన్ని పౌల్ట్రీ ఫారాల్లో కూడా గత నెల రోజులుగా కోళ్లు చనిపోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలు బయటకు రాకుండా కొన్ని ఫామ్ యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

Also Read: Electric Scooter: జస్ట్ రూ.50 వేలకే టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

Chicken: వీకెండ్ లోనూ పస్తులేనా.. తగ్గేదెలే అంటున్న చికెన్ ధరలు..!