Telangana: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పోషకాహారం మెరుగుపర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగి జావ, మిగిలిన మూడు రోజులు పాలు అందించే విధంగా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ చర్య వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
ఇక వచ్చే 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అల్పాహార పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
గత నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగి జావ అందిస్తున్నారు. ఇక మిగిలిన మూడు రోజులు పాలు సరఫరా చేసే విధంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారు 19 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. వీరందరికీ పాలు అందించే ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 1.80 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారికి కూడా పాలు అందిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే స్కూల్ విద్యార్థులకు అమలు చేసే పథకాలను తమకు కూడా వర్తింపజేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ-స్కూల్స్‌గా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం ద్వారా ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఈ పథకం కింద 7 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పాలు, ఉడికించిన గుడ్లు, బాలామృతం, రుచికరమైన భోజనం అందిస్తున్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు రోజుకు ఒక పూట పూర్తి భోజనం (అన్నం, పప్పు, కూరగాయలు), 200 మిల్లీ లీటర్ల పాలు, ప్రతిరోజూ ఒక గుడ్డు అందిస్తున్నారు. అదనంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు మరియు సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారం అందిస్తూ రక్తహీనతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Also Read: SIP: నెలకు రూ.1000 పెట్టుబడితో.. నెలనెలా రూ.20 వేలు..!
Telangana: జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. వారంలో 3 రోజులు పాలు..!
