Crime: స్నానం చేయలేదని తల్లి మందలించిందనీ.. బావిలోకి దూకిన బాలిక!

Girl attempts suicide after being reprimanded for skipping bath

Girl attempts suicide after being reprimanded for skipping bath

Crime: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ చిన్న కుటుంబ వివాదం పెద్ద సంఘటనకు దారితీసింది. స్నానం చేయకుండా ఫోన్ చూస్తూ కూర్చున్న కుమార్తెను తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సమయానికి స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.

ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్‌నగర్‌లో స్వర్ణలత, పోచీరాం దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె సాత్విక (17) ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, రెండో సంవత్సరంలోకి వెళ్లబోతోంది.

బుధవారం ఇంట్లో ఫోన్ చూస్తూ ఉన్న సాత్వికను స్నానం చేయాలని కుటుంబ సభ్యులు కాస్త గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి, సమీపంలోని బజార్‌వాడి ప్రాంతంలో ఉన్న ఓ బావిలో దూకింది.

బావిలో పడిన తర్వాత ప్రాణభయంతో బాలిక కేకలు వేయడం గమనించిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫైర్ ఫైటర్ నరేష్, ఫైర్‌మెన్ రాము, డ్రైవర్ ప్రవీణ్‌కుమార్ తాడు సహాయంతో బావిలోకి దిగి బాలికకు రక్షణ జాకెట్ తొడిగించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలను కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు మరియు ఉన్నతాధికారులు అభినందించారు.

ఈ ఘటనలో సాత్విక కాలికి గాయమవడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే చిన్న విషయానికే ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని పోలీసులు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Also Read: Kala Basha: కుర్చీ తాత ఇకలేడు

Crime: స్నానం చేయలేదని తల్లి మందలించిందనీ.. బావిలోకి దూకిన బాలిక!