Social Media: నేటి డిజిటల్ కాలంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకానికి ఎక్కువగా అలవాటు పడుతున్న పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పిల్లల మానసిక ఆరోగ్యం మరియు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నియంత్రించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను 90 రోజుల్లో సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు, 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్‌లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్నపిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చట్టం రావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. చిన్న వయస్సులోనే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మొబైల్‌లో ఎక్కువసేపు గడపడం వల్ల విద్యార్థులు చదువుపై దృష్టి కోల్పోతున్నారని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక సోషల్ మీడియాలో వడపోత లేకుండా ఉండే కంటెంట్ కారణంగా పిల్లలు హింసాత్మక లేదా అనుచిత సమాచారానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, సైబర్ బుల్లింగ్ వంటి సమస్యలు పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పిల్లలను మొబైల్ వ్యసనం నుంచి దూరం చేసి, ఆటలు, పుస్తక పఠనం వంటి మంచి అలవాట్ల వైపు మళ్లించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులతో చర్చించి అధికారిక మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
