Suprem Court: సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి తొలిసారి అనుమతి

SC Allows Permits Passive Euthanasia For 32-Year-Old

SC Allows Permits Passive Euthanasia For 32-Year-Old

Suprem Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత 13 సంవత్సరాలుగా ‘పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్’ (PVS)లో ఉన్న 31 ఏళ్ల హరీష్ రాణాకు **పాసివ్ యూథనేసియా (కారుణ్య మరణం)**కు అనుమతి ఇచ్చింది. అంటే అతనికి అందిస్తున్న లైఫ్ సపోర్ట్‌ను తొలగించేందుకు కోర్టు అంగీకరించింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘కామన్ కాజ్’ తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఈ తరహా అనుమతి ఇచ్చిన మొదటి కేసుగా ఇది ప్రాధాన్యం పొందింది.

తీర్పును చదివి వినిపించే సమయంలో జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర భావోద్వేగానికి గురైంది. తీర్పు చదువుతున్న సమయంలో జస్టిస్ పార్ధివాలా గొంతు గద్దగద్దలాడింది. ఒక దశలో ఆయన మాటలు కూడా స్పష్టంగా పలకలేకపోయారు. ఈ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ హరీష్‌కు వైద్య సహాయం తొలగించడం మానవతా దృక్పథంతో కూడినదని, ఇది చట్టబద్ధంగా కూడా సమంజసమేనని పేర్కొంది.

హరీష్ రాణా పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థి. 2013లో అతను నివసిస్తున్న పీజీ భవనం నాలుగో అంతస్తు నుంచి అనుకోకుండా కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మెదడు నరాలు దెబ్బతినడంతో అతను 100 శాతం క్వాడ్రిప్లెజిక్ స్థితికి చేరి కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. స్వయంగా కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.

గత 13 సంవత్సరాలుగా అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిరంతరం వైద్య చికిత్స అందిస్తూ అతన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ చికిత్సల వల్ల కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చికిత్సను ఒక్కరోజు కూడా నిలిపివేస్తే అతని ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని వైద్యులు తెలిపారు. కొడుకు మళ్లీ కోలుకునే ఆశలు తగ్గిపోవడంతో కుటుంబ సభ్యులు చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హరీష్‌కు కారుణ్య మరణం అనుమతించాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు స్వీకరించి విస్తృతంగా విచారణ జరిపింది. హరీష్ కుటుంబ సభ్యులు, వైద్య నిపుణుల బృందం, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్చలు జరిపింది. డాక్టర్ల బృందం హరీష్ పూర్తిగా కోలుకునే అవకాశం లేదని నివేదిక ఇచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం హరీష్‌కు అందిస్తున్న లైఫ్ సపోర్ట్‌ను తొలగించడానికి అనుమతి ఇచ్చింది.

అయితే తీర్పులో హరీష్ తల్లిదండ్రులు చూపిన త్యాగం, అంకితభావాన్ని కోర్టు ప్రత్యేకంగా ప్రశంసించింది. ఎన్నో సంవత్సరాల పాటు వారు తమ కొడుకును ఎంతో ప్రేమతో, బాధ్యతతో చూసుకున్నారని పేర్కొంది. ఒక నిమిషం కూడా అతన్ని నిర్లక్ష్యం చేయకుండా కంటికి రెప్పలా చూసుకున్నారని కోర్టు అభినందించింది.

ఈ తీర్పు భారతదేశంలో కారుణ్య మరణంపై చర్చలకు మరోసారి దారి తీసింది. జీవన హక్కు, గౌరవప్రదమైన మరణం వంటి అంశాలపై ఇది ఒక ముఖ్యమైన న్యాయ నిర్ణయంగా భావిస్తున్నారు.

Also Read: War Effect: యుద్ధం తిప్పలు.. ‘షార్ట్స్ వేసుకోండి, మెట్లు ఎక్కండి’

Suprem Court: సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి తొలిసారి అనుమతి